•డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి.
• మున్సిపల్ ఎన్నికల సమరానికి సన్నద్ధం కండి.
• ఒకేరోజు 9 బీజేపీ జిల్లా కార్యాలయాల ప్రారంభం.
• అవకాశవాద కాంగ్రెస్‌పై నితిన్ నబిన్ సమరశంఖం.
• తెలంగాణలో కమలదళం సంస్థాగత మహావిస్తరణ.
• అమరవీరులకు నివాళులర్పించిన నితిన్ నబిన్.
హైదరాబాద్,మహా.
పశ్చిమ బెంగాల్ తరహాలో పోరాడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఉద్ఘాటించారు. అంతేకాకుండా తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్తా సరికొత్త ప్రజా పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర పర్యటన నిమిత్తం ఆదివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు పార్టీ శ్రేణులు, నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో జరిగిన ఈ స్వాగత కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెల్లార్ తదితర అగ్ర నాయకులు పాల్గొన్నారు.
చరిత్రలో తొలిసారి.. ఒకేరోజు 9 కార్యాలయాల ప్రారంభోత్సవం
తెలంగాణలో బీజేపీ సంస్థాగత విస్తరణకు మరింత బలం చేకూరుస్తూ ఒకేరోజు రికార్డు స్థాయిలో తొమ్మిది జిల్లాల నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రంగారెడ్డి రూరల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ నూతన కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి రూరల్‌తో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ నూతన భవనాలు కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలో కమల వికాసానికి ఈ 9 కార్యాలయాలు బలమైన పునాదులుగా మారనున్నాయి.
భవనాలు కావు.. అవి సంకల్ప, సేవా కేంద్రాలు
నూతన కార్యాలయాల ప్రారంభోత్సవం సందర్భంగా నితిన్ నబిన్ మాట్లాడుతూ ఇవి కేవలం సిమెంట్, ఇటుకలతో నిర్మించిన భవనాలు మాత్రమే కావని స్పష్టం చేశారు. ఇవి పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే ‘సంకల్ప కేంద్రాలు’ అని, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచే ‘సేవా కేంద్రాలుగా’ వర్ధిల్లాలని అభివర్ణించారు. “నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్” అనే నినాదంతో పనిచేసే బీజేపీ కార్యకర్తలకు ఈ కార్యాలయాలు నిరంతరం స్ఫూర్తినిచ్చే కేంద్రాలుగా నిలుస్తాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
పటేల్, సుష్మా స్వరాజ్, తెలంగాణ అమరవీరులకు నివాళులు
ఈ చారిత్రాత్మక వేదికపై నుంచి దేశ ఏకీకరణకు అహర్నిశలు కృషి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు నితిన్ నబిన్ వినమ్రంగా నివాళులు అర్పించారు. అలాగే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. నాడు పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన దివంగత అగ్రనేత సుష్మా స్వరాజ్ సేవలను గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడి ఇన్నేళ్లయినా అమరవీరుల కలలు ఇంకా పూర్తిగా నెరవేరలేదని, ఆ ఆశయాలను సాకారం చేయాల్సిన పూర్తి బాధ్యత ఇప్పుడు బీజేపీ భుజస్కంధాలపైనే ఉందని ఆయన ఉద్ఘాటించారు.
నాడు ఇద్దరు ఎంపీలుంటే.. అందులో ఒకరు తెలంగాణ వారే
బీజేపీని కొందరు కావాలనే బయటి పార్టీ అంటూ విమర్శించడంపై నితిన్ నబిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 1984లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి కేవలం ఇద్దరే ఎంపీలు గెలిస్తే, అందులో ఒకరు తెలంగాణ గడ్డ నుంచే గెలిచారనే చారిత్రక సత్యాన్ని ఆయన గుర్తుచేశారు. 1980 నుంచి ఎన్నో కష్టాలు పడి, పోలీసుల లాఠీదెబ్బలు తింటూ, ప్రాణత్యాగాలకు వెరవకుండా తెలంగాణ నేలపై కమల వనాన్ని పూయించిన సీనియర్ కార్యకర్తలందరికీ ఆయన హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరించారు. వారి త్యాగాల వల్లే నేడు తెలంగాణలో పార్టీ ఇంతగా బలపడుతోందని కొనియాడారు.
కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలది అవకాశవాద రాజకీయం
కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల అవకాశవాద, స్వార్థ రాజకీయాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేస్తే, ఆ ఫలాన్ని కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా చేజిక్కించుకుందని విమర్శించారు. దేశ ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థానికే ప్రాధాన్యత ఇచ్చే చరిత్ర కాంగ్రెస్‌దని, ప్రస్తుతం రాష్ట్రాన్ని కేవలం అధికారం అనుభవించే సాధనంగా మార్చుకున్న పాలకులను గద్దెదించే శక్తి ఒక్క బీజేపీ కార్యకర్తలకే ఉందని ఆయన స్పష్టం చేశారు.
బెంగాల్ తరహాలో పోరాడి కాంగ్రెస్‌ను గద్దెదించుతాం
పాలనలో ఘోరంగా విఫలమైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కార్యకర్తలు గ్రామ గ్రామాన, వీధి వీధినా కదలాలని నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో దాడులు, హింసలు, అరాచకాలను తట్టుకుని కమలం ఎలా వికసించిందో, తెలంగాణలో కూడా కార్యకర్తల ప్రజా పోరాటాలతో అదే చరిత్ర పునరావృతం కాబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి వీధిలో, ప్రతి పట్టణంలో కమలం వికసించడం ఖాయమని, దేశమంతా కాషాయమయం అవుతున్న తరుణంలో తెలంగాణలో కూడా ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
2047 లక్ష్యంగా మోదీ సుపరిపాలన – డబుల్ ఇంజిన్ సర్కార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనలో దేశంలోని 140 కోట్ల మంది భారతీయులు ఏకతాటిపై నడుస్తున్నారని నితిన్ నబిన్ ప్రశంసించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలగన్న “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్”, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ‘అంత్యోదయ’, అటల్ బిహారీ వాజ్‌పేయి చూపిన ‘సుశాసన్’ లక్ష్యాలను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. 2047 నాటికి భారత్‌ను అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంలో తెలంగాణ భాగస్వామి కావాలని కోరారు. కేంద్ర నిధులతో తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారని, అయితే రాష్ట్రంలో కూడా ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పడితేనే ఆశించిన సంపూర్ణ ప్రగతి సాధ్యమవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు.
మున్సిపల్ ఎన్నికల సమరానికి నాంది – నాంపల్లికి అగ్రనేతలు
రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీ కార్యకర్తలకు ఒక కొత్త పోరాటానికి నాంది పలకాలని, ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యంతో పనిచేసి కమలాన్ని వికసింపజేయాలని నితిన్ నబిన్ దిశానిర్దేశం చేశారు. 1980లో స్థాపించిన బీజేపీ నేడు 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, త్వరలో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. అధునాతన హంగులతో మంచి కార్యాలయాన్ని నిర్మించుకున్న రంగారెడ్డి రూరల్ జిల్లా నాయకత్వానికి, కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పార్టీ కార్యాలయాలను పవిత్ర దేవాలయాలుగా భావిస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలమైన కార్యాచరణ, వ్యూహరచన ఈ కార్యాలయాల నుంచే ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ చారిత్రక ఘట్టంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్, రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్, కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ తదితర అగ్ర నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.







