- నూతన చట్టాల అమలులో వేగం పెంచాలి
- నేరాల నియంత్రణలో పనితీరు మెరుగుపడాలి
- డీజీపీ సీవీ ఆనంద్
- నేరాల దర్యాప్తు, నూతన చట్టాల అమలులో వెనుకబడిన యూనిట్లతో ప్రత్యేక సమీక్ష
హైదరాబాద్, మహా : నూతన క్రిమినల్ చట్టాల అమలులో వెనుకబడిన పోలీసు యూనిట్లు పనితీరు మెరుగుపర్చుకోవాలని డిజిపి సి. వి. ఆనంద్ సూచించారు. నూతన చట్టాల అమలుతోపాటు నేరాల నియంత్రణ, దర్యాప్తు నాణ్యత, నేర నిరూపణ శాతం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్ ర్యాంకింగ్‌లో వెనుకబడిన యూనిట్ల కమిషనర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో డిజిపి గురువారం సీఐడీ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పనితీరులో మెరుగుదల సాధిస్తేనే జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకు సాధ్యమవుతుందని సూచించారు. గతంలో ఈగల్ ఫోర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోపై నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో పలు సూచనలు, జాగ్రత్తలు సూచించడం, వాటిని అమలు చేయడం ద్వారా ఈగల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో విభాగాలు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గుర్తింపు సాధించాయని పేర్కొన్నారు. ఈగల్ ఫోర్స్ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడంతోపాటు, సైబర్ నేరాల నియంత్రణలోనూ తెలంగాణ జాతీయస్థాయిలో విశేష ప్రతిభ కనబరిచి దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఇదే విధంగా ఇతర అంశాల్లోనూ రాష్ట్రం ముందంజలో నిలవాలంటే క్రమం తప్పకుండా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ లోపాలను గుర్తించి, సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని, అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు.







