- సీఈసీ రాజీనామా డిమాండ్ తో
- కాంగ్రెస్ చలో లోక్ భవన్, ఉద్రిక్తత
- భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
- టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్
హైదరాబాద్, మహా : ఓటర్ల సవరణ ప్రక్రియలో భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చిన చలో లోక్ భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ లోక్ భవన్ వైపు దూసుకెళ్లింది. వందలాది మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు లోక్ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసన తెలుపుతున్న టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి మరియు కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్టుల అనంతరం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటు హక్కును కాపాడటంలో సిఇసి విఫలమయ్యారని ఆరోపించారు. పారదర్శకమైన రీతిలో ఎన్నికల వ్యవస్థ సాగాలంటే సిఇసి జ్ఞానేశ్వర్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ఎంపీలను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించడాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలు ముమ్మాటికీ అక్రమమని, అప్రజాస్వామికమని పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను అరికట్టి పారదర్శకమైన ప్రక్రియను చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ కాంగ్రెస్ స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం వీధిపోరాటాలు చేస్తుందని తేల్చిచెప్పింది. ముట్టడి నేపధ్యంలో రాజ్‌భవన్, లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా భద్రతను పెంచారు.







