- వేలాది జీడిమామిడి మొక్కలతో పచ్చదనానికి బాట
- మొక్క నాటడమే కాదు.. సంరక్షణ కూడా బాధ్యతే
- గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
మెదక్, మహా : పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడంతో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. రైతులకు అదనపు ఆదాయం అందించే ఉద్యాన పంటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో రామాయంపేట–సిద్దిపేట మధ్య ఎన్ హెచ్ -765డిజి జాతీయ రహదారి వెంట జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంగళవారం గవర్నర్ ప్రారంభించారు.
సుమారు 43 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ కార్యక్రమంలో 30–35 వేల మొక్కలు నాటే లక్ష్యంతో పనులు చేపట్టారు.
మొక్క నాటడంతో పని పూర్తికాదు జీడిమామిడి మొక్కలను ఎంపిక చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు దీర్ఘకాలిక ఆదాయ మార్గం కల్పించే అవకాశం ఉందని గవర్నర్ అన్నారు. మొక్క నాటడంతో బాధ్యత పూర్తికాదని, కుటుంబ సభ్యుడిలా భావించి ప్రతి మొక్కను సంరక్షించాలని సూచించారు.
మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడం, రక్షణ కల్పించడం, వాటి ఎదుగుదలను పర్యవేక్షించడం ద్వారా కార్యక్రమం లక్ష్యాన్ని సాధించవచ్చన్నారు. పర్యావరణ పరిరక్షణ, రైతుల సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు.
పర్యావరణం–ఆరోగ్యంపై దృష్టి
పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమని గవర్నర్ అన్నారు. క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఎంపీ రఘునందన్ రావు చేస్తున్న కృషిని అభినందించారు.
ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, రామాయంపేట–సిద్దిపేట మధ్య గతంలో రహదారికి ఇరువైపులా పెద్ద సంఖ్యలో చెట్లు ఉండేవని, జాతీయ రహదారి విస్తరణలో భాగంగా వాటిని తొలగించడంతో పచ్చదనం తగ్గిందన్నారు. ఈ నేపథ్యంలో రహదారి వెంట జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్‌లో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్, ఎంఎల్ సీ మల్క కొమురయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.








