- పాత పద్ధతిలోనే సీఈసీ ఎంపిక జరగాలని డిమాండ్
హైదరాబాద్, మహా :
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఫామ్ -7పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ముస్లింల ఓట్లను టార్గెట్ చేసి తొలగించే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో అసదుద్దీన్ మాట్లాడుతూ, గోషామహల్ నియోజకవర్గంలో ప్రి – ప్రింటెడ్ ఫామ్స్ లభించాయని తెలిపారు. గోషామహల్‌లో ప్రి – ప్రింటెడ్ ఫామ్ -7 ఫామ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. గోషామహల్‌లో బూత్ నంబర్- 28, 30, 127లో ముస్లిం ఓటర్లే టార్గెట్‌గా ఫామ్ -7లు ఎందుకు సమర్పిస్తున్నారని నిలదీశారు.
ఒక వ్యక్తి 122 ఫామ్స్ ఎలా సమర్పించారని అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఆ వ్యక్తి ఎవరు అన్ని ఫామ్స్ ఎలా సమర్పించారని నిలదీశారు. బల్క్‌గా ఫామ్ -7 ఇచ్చిన వాళ్లపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. వెస్ట్ బెంగాల్‌లో ఏం జరిగిందో తమకు తెలీదని చెప్పారు. హైదరాబాద్‌లో తాము ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలిపారు. బీజేపీ నాయకులే ముస్లింల ఓట్ల గురించి ఫామ్ -7 ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఈసీకి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటే బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఈసీ సెలక్షన్ చేసే పద్ధతి సరిగా లేదని ఫైర్ అసదుద్దీన్ మండిపడ్డారు. సీఈసీ సెలక్షన్ ప్రధాన మంత్రి, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు సీజే సమక్షంలో జరగాలని డిమాండ్ చేశారు. పాత పద్ధతి ప్రకారమే సీఈసీ సెలక్షన్ ఉండాలని పట్టుబట్టారు. 2002లో ఓ వ్యక్తికి ఓటు హక్కు ఉందని.. కానీ ఇప్పుడు ‘సర్’ ప్రక్రియలో పేరు ఎందుకు రావట్లేదని నిలదీశారు. అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ‘సర్’లో పేరు ఎందుకు ఉండట్లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. సీఈసీ ఎన్నిక పద్ధతిలో బీజేపీ తీసుకువచ్చిన చట్టం మార్చాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు.








