Mahaa Daily Exclusive

  ఇలాగైతే అధికారంలోకి ఎలా వస్తాం?

Share

ఇలాగైతే అధికారంలోకి ఎలా వస్తాం?
* బీజేపీ పదాధికారులకు అధిష్ఠానం అక్షింతలు.
* హైదరాబాద్‌లో మకాం వేస్తే జిల్లాల్లో పార్టీని నడిపేదెవరు?
*;క్రియాశీల సభ్యత్వం లేకుండానే రాష్ట్ర స్థాయి పదవులా?
* మేనేజ్‌ చేసి పదవులు తెచ్చుకోవడం ఇకపై కుదరదు.
* రాష్ట్ర పదాధికారుల సమావేశంలో సంస్థాగత నేతల ఫైర్.
హైదరాబాద్, మహా.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్ఠానం.. రాష్ట్ర నేతల పనితీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా కేవలం పదవులకే పరిమితమవుతున్న పదాధికారులకు తీవ్ర అక్షింతలు వేసింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశం నాయకుల పనితీరుపై వాడీవేడి చర్చకు వేదికైంది. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్, రాష్ట్ర సహ ఇన్‌చార్జి అభయ్ పాటిల్‌ నాయకుల వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు. సంస్థాగతంగా ఏమాత్రం కదలిక లేకుండా ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని వారు సూటిగా ప్రశ్నించారు. నాయకులు కేవలం పదవులు అనుభవించడం కాకుండా గ్రామ, నియోజకవర్గ స్థాయిలకు వెళ్లి కార్యకర్తలతో మమేకం కావాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు గట్టిగా దిశానిర్దేశం చేశారు.
పార్టీలో బాధ్యతలు తీసుకునే నాయకుల తీరుపై మధుకర్, అభయ్ పాటిల్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కనీసం క్రియాశీల సభ్యత్వం కూడా లేని వారు ఏకంగా రాష్ట్రస్థాయి బాధ్యతల్లో కొనసాగుతుండటంపై మధుకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పదవులు నిర్వహిస్తున్న వారు సంస్థాగతంగా ఎంతో చురుకుగా ఉండాలని స్పష్టం చేశారు. ఇక జిల్లా అధ్యక్షుల పనితీరుపై అభయ్ పాటిల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలోని ముగ్గురు జిల్లా అధ్యక్షులు మినహా మిగిలిన వారంతా జిల్లాలను వదిలేసి హైదరాబాద్‌‌లోని పార్టీ కార్యాలయంలోనే మకాం వేస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులే హైదరాబాద్‌లో ఉంటే ఇక జిల్లాల్లో పార్టీని ఎవరు పర్యవేక్షిస్తారని నిలదీశారు. తక్షణమే వారు జిల్లాలకు వెళ్లి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఢిల్లీలోనో, రాష్ట్ర స్థాయిల్లోనో లాబీయింగ్ చేసి ‘మేనేజ్’ చేసుకుని పదవులు తెచ్చుకునే సంస్కృతి ఇకపై కుదరదని కుండబద్దలు కొట్టారు. నాయకుల క్షేత్రస్థాయి పర్యటనలను, వారి పనితీరును ఇకపై నేరుగా తామే పర్యవేక్షిస్తామని అభయ్ పాటిల్ స్పష్టం చేశారు.
గత మున్సిపల్ ఎన్నికల సమయంలో పార్టీ నిధుల వినియోగంపై కూడా అధిష్ఠానం ఆరా తీసింది. పార్టీ నిధుల విషయంలో జవాబుదారీతనం లోపించిందని, ఎవరైనా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలితే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అభయ్ పాటిల్ కఠినంగా హెచ్చరించారు. అవసరమైతే అలాంటి వారిపై నేరుగా క్రిమినల్ కేసులు సైతం నమోదు చేయిస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు రాష్ట్రంలో రానున్న కీలక ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న ఉమ్మడి వరంగల్–ఖమ్మం–నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికపై నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్, సహ ఇన్‌చార్జులుగా అభయ్ పాటిల్, రేఖా శర్మ, అలాగే సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా మధుకర్, సంయుక్త కార్యదర్శిగా దశరథ్ వాయిలయాలతో కూడిన కొత్త బృందం.. రాష్ట్రంలో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది.