Mahaa Daily Exclusive

  ఐటీ కారిడార్‌లో ప్రైవేట్ హాస్టళ్లకు చెక్‌!

Share

ఐటీ కారిడార్‌లో ప్రైవేట్ హాస్టళ్లకు చెక్‌!
* ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉద్యోగులకు వసతి గృహాలు.
* స్థలాల గుర్తింపు, సాధ్యాసాధ్యాలపై అధికారుల సమగ్ర అధ్యయనం.
* సీఎం రేవంత్‌ రెడ్డికి చేరనున్న సమగ్ర నివేదిక.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌ మహానగరంలోని ఐటీ కారిడార్‌లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్ హాస్టళ్ల దందాకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, కనీస ప్రమాణాలు పాటించకుండా ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ నిర్వాహకులకు గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఐటీ కారిడార్‌లో కొలువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యువతీ యువకులకు ప్రభుత్వపరంగానే అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సకల సదుపాయాలతో కూడిన సురక్షితమైన వసతిని కల్పించేందుకు రేవంత్ రెడ్డి సర్కారు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి భూముల లభ్యత, నిర్మాణ సాధ్యాసాధ్యాలు, నిర్వహణ నమూనాలపై అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో విస్తృత అధ్యయనం ప్రారంభించారు.
తెలంగాణ నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది యువతీ యువకులు ఐటీ కొలువుల కోసం భాగ్యనగరానికి వస్తున్నారు. వీరిలో అత్యధిక శాతం మంది ప్రైవేట్ హాస్టళ్లు, పీజీలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, రాయదుర్గం, గోపన్‌పల్లి, గౌలిదొడ్డి వంటి ప్రధాన ఐటీ ప్రాంతాల్లో హాస్టళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. కేవలం 50 నుంచి 60 గజాల అతి చిన్న విస్తీర్ణంలోనే ఆరు నుంచి ఏడు అంతస్తుల నాసిరకం భవనాలను నిర్మించి, వాటిని ప్రైవేట్ హాస్టళ్లుగా మార్చేస్తున్నారు. సరైన గాలి, వెలుతురు లేని ఇరుకైన గదుల్లో పదుల సంఖ్యలో ఉద్యోగులను కుక్కుతూ, అగ్నిమాపక భద్రత వంటి ప్రాథమిక నిబంధనలను సైతం గాలికొదిలేస్తున్నారు. నాణ్యత లేని భవన నిర్మాణాలు, అపరిశుభ్ర వాతావరణం కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటూ ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ఈ దోపిడీ, అభద్రతకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్ హాస్టళ్లపై కఠిన నియంత్రణ విధించడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అత్యాధునిక హాస్టల్ ప్రాంగణాలను నిర్మించి, నామమాత్రపు రుసుములతో ఉద్యోగులకు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది. ఐటీ కారిడార్‌కు సమీపంలో హాస్టళ్ల నిర్మాణానికి అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు, ఆర్థిక సాధ్యాసాధ్యాలు, పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం) లేదా స్వతంత్ర నిర్వహణ వంటి విధానాలపై అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ అంశంపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నారు. సీఎం పరిశీలించి ఆమోదముద్ర వేసిన వెంటనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం వేగంగా కసరత్తు చేస్తోంది. ప్రభుత్వమే రంగంలోకి దిగి వసతి కల్పిస్తే వేలాది మంది యువ ఉద్యోగులకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు పూర్తి భద్రత లభించనుంది.