Mahaa Daily Exclusive

  సింగరేణి కార్మికుల పక్షాన కవిత కదనం!

Share

సింగరేణి కార్మికుల పక్షాన కవిత కదనం!
• సింగరేణి భవన్ ముట్టడికి యత్నం.. తీవ్ర ఉద్రిక్తత.
• లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి.

హైదరాబాద్, మహా.
సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆందోళన బాట పట్టారు. సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఆమె ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ ముట్టడికి యత్నించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కార్మికుల హక్కుల సాధన కోసం కవిత రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి యాజమాన్యానికి పలు కీలక డిమాండ్లను నిర్ద్వంద్వంగా వినిపించారు.
సింగరేణి సంస్థ ఏటా సాధిస్తున్న భారీ లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటాను తక్షణమే చెల్లించాలని కవిత గట్టిగా డిమాండ్ చేశారు. వైద్యపరమైన కారణాలతో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ బేషరతుగా ‘అన్‌‌ఫిట్’ చేసి, వారి వారసులకు న్యాయం చేయాలని కోరారు. కార్మికుల సౌలభ్యం కోసం నెలకు కనీసం రెండుసార్లు మెడికల్ బోర్డును నిర్వహించాలని, అలాగే దశాబ్దాలుగా వేధిస్తున్న మారుపేర్ల (అలియాస్ నేమ్స్) సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని ఆమె పట్టుబట్టారు. విజిలెన్స్ విచారణల సాకుతో నిలిపివేసిన డిపెండెంట్ (కారుణ్య) నియామకాలను వెంటనే చేపట్టి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, సంస్థలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సంక్షేమానికి సంబంధించి మరిన్ని కీలక డిమాండ్లను సైతం కవిత ఈ సందర్భంగా తెరపైకి తెచ్చారు. సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సొంతింటి నిర్మాణం కోసం రెండు గుంటల స్థలాన్ని కేటాయించాలన్నారు. బొగ్గు గనుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్) నుంచి పూర్తిస్థాయి మినహాయింపునివ్వాలని కోరారు. సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టాలని, హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వారికి వేతనాలు చెల్లించి ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. సంస్థ మనుగడ దెబ్బతినకుండా ఉండేందుకు సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులను కేటాయించాలన్నారు. వీటన్నింటికీ మించి, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన ఏకంగా రూ.62 వేల కోట్ల భారీ నిధులను తక్షణమే చెల్లించి సంస్థను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో డిమాండ్ చేశారు.