- విజయవంతమైన బందోబస్తుతో పోలీసుల సంబరాలు
- సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేసిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్, మహా : హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును విజయవంతంగా నిర్వహించడంతో పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకున్నారు. నిమజ్జన ప్రక్రియ ముగిసిన అనంతరం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ నృత్యం చేశారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ‘ఆయా షేర్’ పాటకు ఆయన చిందులేశారు. గత కొన్ని రోజులుగా విధుల్లో నిమగ్నమై అప్రమత్తంగా ఉన్న పోలీసులు, నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉన్నతాధికారి స్వయంగా వారితో కలవడంతో సిబ్బందిలో ఉత్సాహం రెట్టింపైంది. మరోవైపు, నగరంలో నిమజ్జన క్రతువు ముగియడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేశారు. సచివాలయం పరిసర ప్రాంతాలైన ట్యాంక్‌బండ్, లిబర్టీ, అసెంబ్లీ మార్గాల్లో వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సాధారణ స్థితికి చేరుకుంది.
అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని నాలుగు కమిషనరేట్లలో గణేశ్ శోభాయాత్రలు విజయవంతంగా ముగిశాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అన్నిశాఖల అధికారులను ఆయన అభినందించారు. హోం గార్డ్ నుంచి ఐపీఎస్‌ల వరకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా నిమజ్జనాలు జరిగాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన బందోబస్తు కోసం ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించామని ఆయన పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేష్ విగ్రహాలను అనుకున్న సమయానికి నిమజ్జనం చేశామని సీపీ పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన భాగ్యనగర్ ఉత్సవ సమితికి ధన్యవాదాలు తెలిపారు.
ఈసారి గణేషుడి విగ్రహాలను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారన్నారు. ఖైరతాబాద్ గణపతిని 30 లక్షల మందికిపైగా, బాలాపూర్ గణపతిని 15 లక్షల మంది దర్శించుకున్నారని వెల్లడించారు. శోభాయాత్రాల్లో కొన్ని లోపాలను గుర్తించామని, రాబోయే రోజుల్లో వీటిని సరిదిద్దుకుని, మరింత మెరుగైన సేవలను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది 48 గంటల పాటు నిద్రాహారాలు లేకుండా బందోబస్తు నిర్వహించారని తెలిపారు. శోభాయాత్రలో కలర్ పేపర్ల వల్ల ఇబ్బంది అవుతోందని.. వచ్చే ఏడాది నుంచి వీటిని నిషేధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్నదానం చేసే ప్రాంతాల్లో ఇష్టానుసారంగా చెత్తను పడేస్తున్నారని, దీని వల్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆకతాయిలు, అల్లరి మూకలపై చర్యలు ఉంటాయని సీపీ హెచ్చరించారు.








