Mahaa Daily Exclusive

  ఫలించిన సీఎం రేవంత్ వ్యూహం జూరాల రైతులకు శుభవార్త

Share

  • నీటి విడుదలకు అంగీకరించిన కర్ణాటక సీఎం
  • ఫలించిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల చర్చలు

బెంగళూరు, మహా : కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తెలంగాణ ప్రభుత్వ చర్చలు ఫలించాయి. నీటి విడుదలకు కర్ణాటక సీఎం అంగీకరించారు. తెలంగాణకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కోరగా అందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంతో బుధవారం ఉదయం భేటీ అయ్యారు. మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, ముధుసూదన్‌రెడ్డి కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో భేటీ సందర్భంగా నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాలకు నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి, వారి కష్టాలను డీకేకు వివరించారు. జూరాల ప్రాజెక్టుతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఆయకట్టు పంటలను కాపాడాలని కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోందని, ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ప్రస్తుతం ఆయకట్టు పరిధిలోని పంటలు కీలక దశలో ఉన్నాయని.. నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోయి దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని శివకుమార్ కు తెలంగాణ ప్రతినిధుల బృందం వివరించింది.

ఉమ్మడి పాలమూరు రైతులు నీళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, పంటలు ఎండిపోతే వారి ఆదాయం, జీవనోపాధిపై ప్రభావం పడుతుందన్నారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి సీఎం శివకుమార్ అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దాదాపు 5 వేల క్యూసెక్కుల వరకు కృష్ణా జలాలు విడుదల చేయాలని తెలంగాణ నేతలు కోరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు మంత్రులు, ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన సీఎం డీకే శివకుమార్‌.. రైతులను ఆదుకునేందుకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకుని అధికారులను ఆదేశించారు. రైతుల ఆదుకునేందుకు కృష్ణా జలాల విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంతో పాలమూరు ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఉమ్మడి పాలమూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తే గతవారం వారే స్వయంగా వెళ్లి రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు. అధికారులు పోలీసుల సహాయంతో గేట్లు క్లోజ్ చేసి నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు జూరాల ప్రాజెక్టు నీటి విడుదల కోసం వారం రోజుల నుంచి ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి, నీటి విడుదలకు డీకే శివకుమార్ ను ఒప్పించడంలో సక్సెస్ అయింది.