Mahaa Daily Exclusive

  గణేశ్‌ నిమజ్జనానికి హైదరాబాద్‌ సిద్ధం రేపే ఖైరతాబాద్‌ గణపయ్య నిమజ్జనం రాత్రంతా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లు

Share

హైదరాబాద్, మహా : గణేశ్‌ నిమజ్జనానికి హైదరాబాద్‌ నగరం సిద్ధమవుతోంది. భారీ సంఖ్యలో భక్తులు నగరానికి తరలిరానున్న నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 25 నుంచి 27 వరకు రాత్రి వేళల్లో 8 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిమజ్జన వేడుకల సమయంలో రోడ్లపై భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండే అవకాశం నేపథ్యంలో ఎంఎంటీఎస్‌ రైళ్లు భక్తులకు ప్రత్యామ్నాయ ప్రజా రవాణా సదుపాయంగా ఉపయోగపడనున్నాయి. సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, ఫలక్‌నుమా మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. అన్ని ముఖ్యమైన ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో ఆగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా ఏర్పాట్లు చేశారు.

నిమజ్జన వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే 69 అడుగుల ఖైరతాబాద్‌ పంచముఖ సంకటహర మహాగణపతి నిమజ్జనం శుక్రవారం జరగనుంది. ఉదయం సుమారు 6 గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించి.. మధ్యాహ్నం 12 గంటల్లోపు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తి చేయాలని ఉత్సవ కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు కల్పించి గురువారం నిమజ్జన ఏర్పాట్ల కోసం మండపం, బ్యారికేడ్ల తొలగింపు తదితర పనులు చేపట్టనున్నారు. ఇక ప్రధాన నిమజ్జన కేంద్రంగా ఉన్న హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జన ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా అదనపు క్రేన్లు, ప్లాట్‌ఫారమ్‌లను సిద్ధం చేస్తున్నారు. గతంలో నిమజ్జన కార్యక్రమం మరుసటి రోజుకూ కొనసాగడంతో ట్యాంక్‌బండ్‌, పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరిగేది. ఈసారి ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేలా రెండు ప్లాట్‌ఫారమ్‌లను ఆధునీకరించినట్లు అధికారులు తెలిపారు.

ట్రాఫిక్‌.. పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి

ఖైరతాబాద్‌ మహాగణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక మార్గదర్శకాలు, వాహనాల మళ్లింపులు, పార్కింగ్‌ ప్రాంతాలు, భక్తుల కోసం ప్రత్యేక నడక మార్గాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్‌ ప్రాంతంలో రద్దీని నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. జీహెచ్‌ఎంసీ కూడా రోడ్ల మరమ్మతులు, బ్యారికేడింగ్‌, పారిశుద్ధ్యం, తాగునీరు, మొబైల్‌ టాయిలెట్లు, నిమజ్జన క్రేన్ల వంటి ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఖైరతాబాద్‌ ప్రాంతంలో నిమజ్జనానికి సంబంధించిన పారిశుద్ధ్య ఏర్పాట్లు సెప్టెంబర్‌ 24 నుంచి 27 వరకు కొనసాగించేలా చర్యలు చేపట్టారు. నిమజ్జన వేడుకలు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులు భక్తులు, ఇతర ప్రయాణికులకు కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనాన్ని వీక్షించేందుకు వచ్చిన వారు రోడ్డు రద్దీని తప్పించుకుని రైళ్ల ద్వారా తమ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంటుంది.