- విద్యానగర్‌లో వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన
హైదరాబాద్, మహా : రాష్ట్రంలోని 14 లక్షల మంది విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 8,500 కోట్లను వెంటనే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి బుధవారం వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని కోరారు. బకాయిలు చెల్లించకపోవడంతో కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదన్నారు. ఫీజుల సమస్యతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యార్థుల ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, సి. రాజేందర్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.








