- నాగోల్‌లో ఘనంగా బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్, మహా : రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు మాత్రమే కాదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే ప్రజాప్రతినిధికి నిజమైన సంతృప్తినిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా (ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా) ప్రజా జీవితంలో 25 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో నాగోల్‌లో బుధవారం భారీ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు స్వయంగా రక్తదానం చేసి యువతలో ఉత్సాహం నింపారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు, ఓట్లు, రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని, సమాజ హితం కోసం నిస్వార్థ సేవ చేయడమే రాజకీయ నాయకత్వానికి అసలైన పరమార్థమని స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ నాయకుడి ఆలోచనా విధానంలో ప్రజాసేవ అంతర్భాగం కావాలని, సమాజానికి మేలు చేసినప్పుడే అంతర్గతంగా నిజమైన సంతృప్తి, సంతోషం లభిస్తాయని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ జన్మదినం, అలాగే ఆయన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ప్రజల్లో సేవా భావాన్ని మరింత పెంపొందించాలనే సంకల్పంతోనే ఈ ‘సేవా సంకల్ప్ అభియాన్’ను చేపట్టినట్లు తెలిపారు. ప్రధాని మోదీ విద్యారంగానికి పెద్దపీట వేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎయిమ్స్, ఐఐఎంలతో పాటు ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సంఖ్యను భారీగా పెంచి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేశారని కొనియాడారు. విద్యార్థులు, యువత సంక్షేమానికి మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశాన్ని ప్రగతి పథంలో నిలుపుతున్నాయన్నారు.
మోదీ నిరంతర దేశసేవను ఆదర్శంగా తీసుకుని యువత సేవా రంగంలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణవ్యాప్తంగా ఏకంగా 25 వేల మంది యువతీయువకులు రక్తదానం చేసి వేలాది మంది ప్రాణాలను నిలబెట్టే మహత్తర క్రతువుకు శ్రీకారం చుట్టడం ఎంతో ప్రశంసనీయమని అభినందించారు. తాను కూడా విద్యార్థి దశ నుంచే అనేకసార్లు రక్తదానం చేశానని, ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు చేసే రక్తదానం జీవితంలో వెలకట్టలేని సంతృప్తిని ఇస్తుందని గుర్తుచేశారు. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిస్తూ, రాష్ట్రంలోని మరింత మంది యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, బండ కార్తీక రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.








