Mahaa Daily Exclusive

  ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి

Share

తెలంగాణ భవిష్యత్తు, ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే చారిత్రాత్మక ఘట్టమిది

‎అధికారులంతా స్ఫూర్తితో భాగస్వాములు కావాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‎డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రపంచ పెట్టుబడుల సదస్సు

‎దేశ, విదేశాల్లో రోడ్‌షోలు.. వార్‌రూమ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ

‎‎
‎హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ – 2026’ ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. “తెలంగాణ భవిష్యత్తును, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని కొత్త శిఖరాలకు చేర్చే ఈ చారిత్రాత్మక ఘట్టంలో అధికారులంతా భాగస్వాములై ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ను దిగ్విజయం చేయాలి” అని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు నిర్వహించనున్న ఈ గ్లోబల్ సదస్సు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ‎సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, ప్రచారం, రోడ్‌షోల నిర్వహణపై డిప్యూటీ సీఎం పక్కా కార్యాచరణను ఖరారు చేశారు.

‎ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న రెండో ప్రపంచ సదస్సు ఇదని, దీని ద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. సదస్సు నిర్వహణ పర్యవేక్షణకు దాదాపు 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రతి కమిటీకి ఒక సీనియర్ అధికారి నేతృత్వం వహిస్తారన్నారు. పనుల రూపకల్పన, బడ్జెట్ అంచనాలు, ఆమోదాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగడానికి వీల్లేదని, అధికారుల కమిటీలతో పాటు ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసి, వాటికి సంబంధిత మంత్రులను చైర్‌పర్సన్లుగా నియమించినట్లు తెలిపారు. ప్రతి కమిటీకి కన్వీనర్లను కూడా నియమించామని, వారు వెంటనే సంబంధిత మంత్రులను కలిసి బాధ్యతలు స్వీకరించి పనులు ప్రారంభించాలన్నారు. అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రతిరోజూ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.

‎ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా వేదికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. “ఈ రోజు నుంచే ప్రతిరోజూ సదస్సుకు సంబంధించిన ఏదో ఒక వార్త మారుమోగాలి. ప్రచారానికి ఆకాశమే హద్దుగా పనిచేసి, పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరయ్యేలా చూడాలి” అని అధికారులకు స్పష్టం చేశారు.