Mahaa Daily Exclusive

  తీరం దిశగా తీవ్ర వాయుగుండం.

Share

* కళింగపట్నం వద్ద నేటి రాత్రే తీరం దాటే అవకాశం.
* ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై పెనుగాలుల ముప్పు.
* ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక.
* అప్రమత్తమైన యంత్రాంగం.
విశాఖపట్నం, మహా .
పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న గాఢ వాయుగుండం తీరం దిశగా వేగంగా దూసుకొస్తోంది. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలపై పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. బుధవారం ఉదయం 8:30 గంటల సమయానికి ఇది కళింగపట్నానికి ఆగ్నేయంగా కేవలం 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా బులెటిన్‌లో వెల్లడించింది. ఈ వ్యవస్థ మరింత ముందుకు సాగి నేటి రాత్రి విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య, కళింగపట్నం సమీపంలో తీరం దాటే బలమైన అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలోనూ ఇది గాఢ వాయుగుండం తీవ్రతతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరంలో వాతావరణం భీకరంగా మారనుంది. తీరం వెంబడి గంటకు 30 నుంచి 35 నాటికల్ మైళ్ల వేగంతో, అప్పుడప్పుడు గరిష్ఠంగా 40 నాటికల్ మైళ్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని విశాఖ తీర వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రం తీవ్రంగా అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
వాయుగుండం కదలికలతో ఉత్తరాంధ్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే వీలుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా రోడ్లపై దృశ్యమానత (విజిబిలిటీ) గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున దూరప్రాంత ప్రయాణికులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చన్న అంచనాలతో అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.
తీవ్ర వాయుగుండం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తీరప్రాంత పోర్టులకు తుపాను హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్రలోని కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో స్థానిక అప్రమత్తత సంకేతం నంబర్ 3 (ఎల్‌సీ-3)ని కొనసాగిస్తున్నారు. దక్షిణాంధ్రలోని మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లోనూ అప్రమత్తత హెచ్చరికలు అమలులో ఉన్నాయి. తీరప్రాంత జిల్లాల యంత్రాంగం ఎలాంటి ఆపత్కాలాన్నైనా ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది.