Mahaa Daily Exclusive

  నిజాం ఆస్తుల కంటే కేసీఆర్ కుటుంబ ఆస్తులే ఎక్కువ..

Share

  • నిజాం ఆస్తుల కంటే
    కేసీఆర్ కుటుంబ ఆస్తులే ఎక్కువ
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • మొయినాబాద్ – అజీజ్ నగర్ భూముల పరిశీలించిన మల్లురవి టీమ్

హైదరాబాద్, మహా : బీఆర్‌ఎస్‌ నేతలకు చెందినవని ఆరోపిస్తూ, ఆ భూముల నిజాలు నిగ్గుతేల్చేందుకు కాంగ్రెస్​ నేతలు గత రెండు రోజులుగా బృందంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హస్తం పార్టీ ప్రజాప్రతినిధులు రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌లోని హరీశ్‌రావు ఫామ్‌హౌస్‌ను సందర్శించారు. మూడోరోజు క్షేత్రస్థాయి భూముల పరిశీలనలో భాగంగా నగరంలోని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్​ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పర్యటించారు. తాము ఫామ్‌హౌస్‌లోకి వెళ్లలేదని, ప్రజలకు తెలియజేయాలనే ఇక్కడికి వచ్చామని మల్లు రవి తెలిపారు. పేదల నుంచి అసైన్డ్ భూములను గుంజుకుని ఫామ్‌హౌస్‌లు కట్టారని, అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. నిజాం ఆస్తుల కంటే మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులే ఎక్కువని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఆ ఆస్తులన్నీ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే భూముల పరిశీలనకు వచ్చామన్నారు. కేటీఆర్​కు 2009లో లేని ఆస్తులు ఇప్పుడెలా వచ్చాయని ప్రశ్నించారు. హరీశ్​రావుకు ఉద్యమ సమయంలో లేని ఫామ్​హౌస్ ఇప్పుడు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ ఫామ్​హౌస్ పక్కన ఉన్న 300 ఎకరాల అసైన్డ్ భూములను దళితులకు ఎందుకు పంచలేదని నిలదీశారు. ఆ భూమిని కబ్జా చేయాలని కేసీఆర్ చూశారని ఆరోపించారు.

అప్పుల పాలు చేశారు

111 జీవో నిబంధనలను తుంగలో తొక్కి ఫామ్‌హౌస్‌ నిర్మాణం చేపట్టారని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 2004 ఎన్నికల అఫిడవిట్​లో లేని ఆస్తులు ఇప్పుడు ఉన్నట్టుండి ఎలా వచ్చాయని ప్రశించారు. మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాలనలో అప్పుల పాలు చేశారని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో ప్రజలకు తెలియజేసేందుకే క్షేత్రస్థాయి పర్యటన చేపట్టినట్లు వివరించారు. 450 ఎకరాలకు పైగా ఉన్న భూముల వివరాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ఐలయ్య. వీర్లపల్లి శంకర్, రామ్మోహన్ రెడ్డి, నవీన్ యాదవ్, మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.