హైదరాబాద్, మహా : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నందున తెలంగాణలో ఆదివారం నుంచి వారం రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
వాయుగుండంగా మారే అవకాశం..
ప్రస్తుతం అల్పపీడనం ఉత్తర అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇది సెప్టెంబర్ 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 23 ఉదయం నాటికి దక్షిణ ఒడిశా–ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో 20, 21, 22, 23, 24, 25వ తేదీల్లో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.







