- విజయవాడలో పెరిగిన డివిజన్లు.. 64 నుంచి 86కు
- గెజిట్ నోటిఫికేషన్ జారీ.. ఇక 86 డివిజన్లతోనే ఎన్నికలు
- 22 కొత్త డివిజన్లతో ఆశావహుల్లో జోష్.. కూటమి సర్కారు నిర్ణయంపై రాజకీయ ఆసక్తి
విజయవాడ, మహా: విజయవాడ నగరపాలక సంస్థలో డివిజన్ల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు ఉన్న 64 డివిజన్లను 86కు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నగరంలో మరో 22 డివిజన్లు అందుబాటులోకి వచ్చాయి. రానున్న పురపాలక ఎన్నికలు కొత్త డివిజన్ల పునర్విభజన ప్రకారమే జరగనున్నాయి. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న ఆశావహుల్లో రాజకీయ సందడి మొదలైంది.
జనాభా ప్రాతిపదికగా పునర్విభజన
డివిజన్ల పునర్విభజనకు జనాభా, పరిపాలనా సౌలభ్యం ప్రధాన ప్రాతిపదికగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. ఒకే డివిజన్‌లో అధిక జనాభా, ఓటర్ల సంఖ్య ఉండటంతో ప్రజలకు స్థానిక పాలన మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో డివిజన్ల సంఖ్య పెంచినట్లు తెలుస్తోంది. విజయవాడ జనాభా గత జనగణనతో పోలిస్తే గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత విభజనలో మార్పులు అవసరమయ్యాయని అధికారులు భావించారు.
అభ్యంతరాలు.. తుది నోటిఫికేషన్
డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ప్రతిపాదనలు రూపొందించి, అభ్యంతరాలకు అవకాశం కల్పించిన అనంతరం తుది ప్రతిపాదనలను ఖరారు చేశారు. అనంతరం ప్రభుత్వం తుది గెజిట్ విడుదల చేసింది. డివిజన్ల పెంపుపై న్యాయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినప్పటికీ.. ప్రక్రియ ముందుకు సాగింది.
రాష్ట్రంలోని ఇతర నగరాల్లోనూ పెంపు
డివిజన్ల పునర్విభజన విజయవాడకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని పలు ప్రధాన నగరపాలక సంస్థల్లోనూ డివిజన్ల సంఖ్యను పెంచారు. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థలో 98 నుంచి 120కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కు డివిజన్ల సంఖ్య పెంచినట్లు సమాచారం. కర్నూలులో 52 నుంచి 68కు, తిరుపతి, కడపలో 50 నుంచి 66కు, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, విజయనగరంలో 50 నుంచి 62కు పెంచారు.
ఎన్నికలకు కొత్త రాజకీయ లెక్కలు
విజయవాడలో 22 కొత్త డివిజన్లు ఏర్పడటంతో రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కొత్త డివిజన్లలో పోటీ చేసేందుకు అధికార కూటమితో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసే అవకాశం ఉంది. డివిజన్ల పునర్విభజన తర్వాత రిజర్వేషన్ల ఖరారు కీలకంగా మారనుంది. ఏ డివిజన్ ఏ వర్గానికి రిజర్వు అవుతుందన్న దానిపై ఆశావహుల రాజకీయ భవిష్యత్తు ఆధారపడనుంది.
ప్రత్యేకాధికారి పాలన నుంచి ఎన్నికల వైపు
విజయవాడ నగరపాలక సంస్థకు గత పాలకవర్గం పదవీకాలం ముగిసిన అనంతరం ప్రత్యేకాధికారి పాలన కొనసాగుతోంది. ఇప్పుడు డివిజన్ల పునర్విభజన పూర్తవడంతో ఎన్నికల ప్రక్రియకు మరో కీలక అడుగు ముందుకు పడినట్లయింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
22 కొత్త డివిజన్ల ఏర్పాటుతో విజయవాడ నగర రాజకీయాల్లో కొత్త ముఖాలకు అవకాశాలు పెరగడంతోపాటు.. ఇప్పటికే రాజకీయంగా క్రియాశీలంగా ఉన్న ఆశావహులకు కూడా తమ బలాన్ని పరీక్షించుకునే వేదిక సిద్ధమైనట్లయింది. దీంతో రానున్న విజయవాడ నగరపాలక ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనిపిస్తోంది.








