- అసెంబ్లీలో నడిచింది సభ కాదు.. కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల నాటకం.
- రూ.33 వేల కోట్ల ఐడీపీఎల్ భూములు ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదు?
- ధరణి భూ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి.. 200కు పైగా ఆధారాలు ఉన్నాయి.
- బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.
హైదరాబాద్, మహా:
గత ఐదు రోజులుగా శాసనసభ సమావేశాలు సాగిన తీరు రాష్ట్ర ప్రజలను నిరాశకు గురిచేసిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సభలో అవినీతి, భూ అక్రమాలపై బీజేపీ ప్రశ్నలు సంధిస్తుంటే మంత్రులు మైకులు కట్ చేయిస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ సభా సమయాన్ని వృథా చేశాయని ఆరోపించారు.
22ఏపై మంత్రి వివరణలపై ప్రశ్నలు
22ఏ నిషేధిత జాబితాపై చివరి రోజు జరిగిన చర్చలో సంబంధిత మంత్రి సుదీర్ఘంగా మాట్లాడినా.. లక్షలాది మంది రైతులు, పేదలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇవ్వలేదని ఏలేటి విమర్శించారు. 22ఏ సెక్షన్లను కోర్టు నిర్ణయించిందని మంత్రి చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. చట్టాలు చేయాల్సింది చట్టసభలేనని, ప్రభుత్వాలు జీవోలు జారీ చేస్తాయని.. కోర్టులు చట్టాలు చేయవని స్పష్టం చేశారు.
ధరణి భూ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ ఏది?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో తీవ్రమైన అంశాలు వెలుగులోకి వచ్చాయని ఏలేటి పేర్కొన్నారు. సుమారు 13 వేల లావాదేవీల ద్వారా దాదాపు 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు మంత్రులే అసెంబ్లీలో అంగీకరించిన వీడియో రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రభుత్వం భావిస్తే వాటిని ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ అనేది టైటిల్ డీడ్ కాదని, తప్పుగా జరిగిన రిజిస్ట్రేషన్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని నిలదీశారు. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఏర్పాటు చేసిన సిట్‌కు బదులుగా కొత్తగా ఏర్పాటు చేసిన దర్యాప్తు వ్యవస్థపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం భూ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త భూదందా: ఆరోపణ
ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూములపై కొత్త దందాకు తెరలేపుతున్నారని ఏలేటి ఆరోపించారు. పేద అసైనీల నుంచి ముందుగానే బాండ్ పేపర్లు, నోటరీలు రాయించుకుని.. అనంతరం ఫ్రీహోల్డ్ పేరుతో విలువైన భూములను ఇతరుల పేర్లకు మార్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
ఐడీపీఎల్ భూములపై తీవ్ర ఆరోపణలు
కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్‌కు సంబంధించిన 333 ఎకరాల భూముల వ్యవహారాన్ని ఏలేటి ప్రస్తావించారు. ఆ భూముల విలువ దాదాపు రూ.33 వేల కోట్లు ఉంటుందని పేర్కొంటూ.. ఇంత భారీ విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ.. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
హైడ్రాపై ద్వంద్వ వైఖరి: ఏలేటి
హైడ్రా విషయంలో ప్రభుత్వం పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం అమలు చేస్తోందని ఏలేటి ఆరోపించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న ప్రభుత్వం.. నదీ పరిధిలో పెద్దల ఆక్రమణలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హైడ్రా అధికారులు ఇచ్చిన నోటీసులపై కూడా చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని నిలదీశారు.
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సంబంధించిన భూవ్యవహారాలు, అక్రమ నిర్మాణాలపై అధికారులు మౌనం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు సంబంధిత మంత్రి వ్యాపార ప్రయోజనాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన వ్యాపార ప్రయోజనాలు ప్రభుత్వ నిర్ణయాలతో ముడిపడితే అది ప్రయోజనాల సంఘర్షణ కాదా అని ప్రశ్నించారు. రూ.1,400 కోట్ల కాంట్రాక్టులను రివైజ్డ్ ఎస్టిమేట్ల పేరుతో రూ.4,000 కోట్లకు పెంచడం వెనుక కారణాలేమిటో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
200కు పైగా కేసు స్టడీలు ఉన్నాయన్న ఏలేటి
అధికారంలో ఉన్నామని విర్రవీగితే చూస్తూ ఊరుకోబోమని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. తమ వద్ద 200కు పైగా ఆధారాలతో కూడిన కేస్ స్టడీలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి ఆడుతున్న దోపిడీ నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని అన్నారు.
భూ అక్రమాలు, అవినీతి ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను, గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. అవసరమైతే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నివాసం ఎదుట ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగడతామని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.








