Mahaa Daily Exclusive

  22ఏ లెక్కల గందరగోళానికి తెరదించాలి.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి…

Share

*22ఏ లెక్కల గందరగోళానికి తెరదించాలి.. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

*ఐదు లక్షల ఎకరాలా.. 47,440 ఎకరాలా? లెక్కల్లో వ్యత్యాసమేంటి?

*జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ వారీగా 22ఏ వైట్‌పేపర్‌ విడుదల చేయాలి.
• బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి.

హైదరాబాద్‌, మహా:

తెలంగాణలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన లెక్కల్లో ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సహ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్సీ డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. 22ఏ భూముల విస్తీర్ణం, రిజిస్ట్రేషన్లు, భూముల వర్గీకరణ, దేవాదాయ భూముల లెక్కలు, డేటా మార్పులపై ప్రభుత్వం సమగ్ర వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. లెక్కల్లో గందరగోళానికి తెరదించి.. బాధితుల సమస్యలకు కాలపరిమితితో పరిష్కారం చూపాలని కోరారు.

47,440 ఎకరాలా.. ఐదు లక్షల ఎకరాలా?

2023 డిసెంబరు 7 నాటికి రాష్ట్రంలో 1,02,52,690 ఎకరాలు 22ఏ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించిందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 31 నాటికి ఈ విస్తీర్ణం 1,02,05,250 ఎకరాలకు తగ్గినట్లు పేర్కొన్నారని అన్నారు. ఈ రెండు గణాంకాలను పరిశీలిస్తే 47,440 ఎకరాలు మాత్రమే తగ్గినట్లు కనిపిస్తోందని వివరించారు.

అయితే సెప్టెంబరు 7న మీడియాలో వెల్లడైన వివరాల్లో దాదాపు ఐదు లక్షల ఎకరాలు తగ్గినట్లు పేర్కొన్నారని ఆయన అన్నారు. అసలు 22ఏ పరిధి నుంచి తగ్గిన భూమి ఐదు లక్షల ఎకరాలా.. లేక 47,440 ఎకరాలా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రిజిస్ట్రేషన్‌ ఆదాయం పెరిగితే సమస్య పరిష్కారమైనట్లేనా?

రిజిస్ట్రేషన్‌ ఆదాయం పెరగడాన్ని మాత్రమే 22ఏ సమస్య పరిష్కారానికి ప్రామాణికంగా పరిగణించలేమని సుధాకర్‌రెడ్డి అన్నారు. 2025 ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్‌ ఆదాయం రూ.6,216 కోట్లు ఉండగా.. 2026లో అదే కాలానికి రూ.7,575 కోట్లకు పెరిగిందని తెలిపారు.

2026 జూన్‌ 5 నుంచి మార్కెట్‌ విలువలను సవరించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ ఆదాయం పెరగడం సహజమేనని పేర్కొన్నారు. అందువల్ల 22ఏ అంశంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి? 22ఏ కారణంగా ఎన్ని తిరస్కరణకు గురయ్యాయి? ఎన్ని దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.

భూముల వర్గీకరణపైనా వివరణ ఇవ్వాలి

ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రభుత్వ వ్యవసాయ భూములు 96,36,777 ఎకరాలు, ప్రైవేటు వ్యవసాయ భూములు 3,73,930 ఎకరాలు, వ్యవసాయేతర భూములు 1,94,543 ఎకరాలుగా ఉన్నాయని సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మూడు వర్గాలను కలిపితే 1,02,05,250 ఎకరాలు అవుతున్నాయని పేర్కొన్నారు.

అదే సమయంలో 5,12,792 ఎకరాల దేవాదాయ భూముల గణాంకాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయని అన్నారు. ఈ భూములు మొత్తం లెక్కల్లో ఏ వర్గంలో ఉన్నాయో ప్రభుత్వం స్పష్టంగా వివరించాలని డిమాండ్‌ చేశారు.

4.02 లక్షల ఎకరాల వ్యత్యాసం ఎందుకు?

98,02,544 ఎకరాలకు సంబంధించిన లెక్కకు, 1,02,05,250 ఎకరాల లెక్కకు మధ్య సుమారు 4.02 లక్షల ఎకరాల వ్యత్యాసం ఎందుకు వచ్చిందో కూడా ప్రభుత్వం ప్రజలకు వివరించాలని సుధాకర్‌రెడ్డి కోరారు. వేర్వేరు డేటాసెట్లు లేదా భూముల వర్గీకరణ విధానాల కారణంగానే ఈ తేడా ఏర్పడితే.. ఆ వివరాలను బహిరంగంగా వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

25 వేల ఇళ్ల సమస్యకు పరిష్కారం ఎప్పుడు?

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 23 వేల ఎకరాలను ప్రజలకు పునరుద్ధరించగా.. మరో 20 వేల ఎకరాలను పాత రికార్డుల్లోని పొరపాట్ల కారణంగా తొలగించినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయినప్పటికీ సుమారు 25 వేల ఇళ్లు ఇంకా 22ఏ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోందని అన్నారు. ఆయా కుటుంబాలకు గడువుతో కూడిన పరిష్కారాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

ప్రైవేటు ఆస్తులకు రక్షణ కల్పించాలి

‘కొత్తగా భూమిని 22ఏ జాబితాలో చేర్చలేదు’ అని చెప్పడం మాత్రమే సరిపోదని సుధాకర్‌రెడ్డి అన్నారు. డేటా అప్‌డేట్‌ తర్వాత గతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగిన ప్రైవేటు ఆస్తుల్లో ఎన్ని కొత్తగా 22ఏ ప్రభావానికి గురయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.

ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములను రక్షించాల్సిందేనని.. అదే సమయంలో చట్టబద్ధమైన ప్రైవేటు ఆస్తులను 22ఏ పేరుతో ఇబ్బందులకు గురిచేయకూడదని సూచించారు. ఆస్తి హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని కోరారు.

సర్వే నంబర్‌ వారీగా వైట్‌పేపర్‌

22ఏ భూములకు సంబంధించి జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్‌ వారీగా పూర్తి వివరాలతో కూడిన వైట్‌పేపర్‌ను ప్రభుత్వం విడుదల చేయాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రతి బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి.. దానికి కాలపరిమితితో కూడిన పరిష్కారం చూపాలని కోరారు.

22ఏ వ్యవహారంలో కేవలం లెక్కలపై వివాదం కాకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. “లెక్కల కంటే స్పష్టత అవసరం.. ఆరోపణల కంటే పరిష్కారమే ముఖ్యం” అనే వైఖరితో ప్రభుత్వం ముందుకు సాగాలని, ప్రజల చట్టబద్ధమైన ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలని సుధాకర్‌రెడ్డి కోరారు.