Mahaa Daily Exclusive

  చిన్న ఘటన జరిగినా ప్రభుత్వానికే చెడ్డపేరు…

Share

  • చిన్న ఘటన జరిగినా ప్రభుత్వానికే చెడ్డపేరు.
  • మండపాలకు ఉచిత విద్యుత్‌.. అనధికార కనెక్షన్లు తీసుకుంటే చర్యలు
  • నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు.
    • సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మహా:

హైదరాబాద్‌లో గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గణేష్‌ ఉత్సవాల్లో చిన్న సంఘటన జరిగినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందని, శాంతిభద్రతలతో పాటు ట్రాఫిక్‌ నిర్వహణను పటిష్టంగా చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

సోషల్‌ మీడియాలోనూ నిఘా

ఉత్సవాల సందర్భంగా సోషల్‌ మీడియాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం ఆదేశించారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా, మతపరమైన ఉద్రిక్తతలకు కారణమయ్యేలా పోస్టులు చేసే వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. శోభాయాత్రలు, నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

మండపాలకు ఉచిత విద్యుత్‌

దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్‌ గణేష్‌ మండపాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. నిర్వాహకులు అధికారుల వద్ద నమోదు చేసుకుని విద్యుత్‌ కనెక్షన్‌ పొందాలని సూచించారు. అనధికార విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ప్రతి మండపానికి జియో ట్యాగింగ్‌

గణేష్‌ మండపాల వివరాలను ముందుగానే పోలీస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సీఎం సూచించారు. ప్రతి మండపం లొకేషన్‌, నిర్వాహకుల వివరాలు, ముఖ్య అతిథులు, నిమజ్జనానికి వెళ్లే మార్గం వంటి సమాచారాన్ని ముందుగానే అప్‌డేట్‌ చేయాలని ఆదేశించారు. దీనివల్ల శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిర్వహణను మరింత సమర్థంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు.

నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

సెప్టెంబర్‌ 14 నుంచి 25 వరకు జరగనున్న నిమజ్జన కార్యక్రమాల కోసం జీహెచ్‌ఎంసీ, హైడ్రా, జలమండలి, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. ట్యాంక్‌బండ్‌, బాలాపూర్‌ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్రల మార్గాల్లో ప్రత్యేక క్రేన్లు, విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

రాష్ట్రంలో ఉన్న సుమారు 1,300 చెరువుల్లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు, ఐదు చెరువుల్లో మాత్రమే కొన్ని ఆంక్షలు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాల్లో నిమజ్జనానికి ఇబ్బందులు లేవని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ సమీక్షలో స్పష్టం చేసినట్లు సమాచారం. పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

రాత్రి 10 తర్వాత భారీ శబ్దాలకు నో

ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాత్రి 10 గంటల తర్వాత డీజేలు, భారీ లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని అనుమతించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్వాహకులకు ముందుగానే అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.