Mahaa Daily Exclusive

  తిరుమలకు చేరిన అంబానీ ‘ధర్మరథాలు’….

Share

తిరుమలకు చేరిన అంబానీ ‘ధర్మరథాలు’..
* తొలి విడతగా 15 ఎలక్ట్రిక్‌ బస్సులు!
*రూ.27.5 కోట్ల విలువైన 25 బస్సులు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనంత్‌ అంబానీ
*బ్రహ్మోత్సవాల వేళ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం.. భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం

తిరుమల, మహా:

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా అందించనున్న 25 ఎలక్ట్రిక్‌ ‘ధర్మరథం’ బస్సుల్లో తొలి విడతగా 15 బస్సులు ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నాయి. పర్యావరణహితమైన ఈ బస్సులు అందుబాటులోకి రావడంతో తిరుమలలో భక్తుల ఉచిత రవాణా మరింత సౌకర్యవంతం కానుంది.

ఈ ఏడాది జూన్‌లో అనంత్‌ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా భక్తుల రవాణా కోసం రిలయన్స్‌ సంస్థ తరఫున రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్‌ బస్సులు, వాటి నిర్వహణకు అవసరమైన 50 మంది డ్రైవర్లు, ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్‌ను అందజేస్తామని ప్రకటించారు. తాజాగా తొలి 15 బస్సులను తిరుమలకు పంపించడంతో ఇచ్చిన హామీని అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది.

బ్రహ్మోత్సవాల వేళ సేవలు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ సామాన్య భక్తులకు రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బస్సులను వినియోగించనున్నారు. ఈ నెల 16న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలకు భక్తుల రాక భారీగా పెరిగే నేపథ్యంలో.. అదనపు బస్సులు అందుబాటులోకి రావడం రవాణా వ్యవస్థకు ఊతమివ్వనుంది. ముఖ్యంగా కొండపై ప్రైవేట్‌ వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఈ ఎలక్ట్రిక్‌ బస్సులు ఉపయోగపడే అవకాశం ఉంది.

మరో ఏడు బస్సులు కూడా..

రిలయన్స్‌ సంస్థ అందజేస్తున్న 25 ఎలక్ట్రిక్‌ బస్సులకు తోడు భారత్‌ బయోటెక్‌ సంస్థ మరో ఏడు ఎలక్ట్రిక్‌ బస్సులను సమకూర్చనుంది. అవి కూడా త్వరలో భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఎలక్ట్రిక్‌ బస్సుల వినియోగం పెరగడంతో తిరుమలలో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ఇంధన వ్యయాన్ని నియంత్రించేందుకు అవకాశం ఉంటుంది. ఛార్జింగ్‌ సదుపాయంతో పాటు ప్రత్యేక డ్రైవర్లను కూడా సమకూర్చే ఏర్పాట్లు ఉండటంతో టీటీడీపై నిర్వహణ భారం కూడా తగ్గే అవకాశం ఉంది.

సామాన్య భక్తులకు మరింత సౌకర్యం

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో సామాన్యుల సంఖ్యే అధికంగా ఉంటుంది. కొండపై వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే భక్తులకు ఉచిత రవాణా ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి రావడం వల్ల వేచి చూసే సమయం తగ్గడంతో పాటు ప్రయాణ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.