- కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- కంటైనర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
- అక్కడికక్కడే ఆరుగురు మృతి, మరో 20 మందికి గాయాలు
హైదరాబాద్, మహా : హైదరాబాద్- విజయవాడ హైవేపై తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయల్దేరింది. బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉండగా. సూర్యాపేట సమీపంలో డ్రైవర్ ఛేంజ్ అయ్యారు. ఆ తర్వాత బస్సు బయల్దేరగా కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలోకి చేరుకోగానే ముందు ఐరన్ రాడ్లతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు రైట్ యాక్సిడెంట్ కాగా ఐరన్ రాడ్లు బస్సులోపలికి దూసుకెళ్లాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సహాయక చర్యలు చేట్టి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతి చెందిన వారంతా ఏపీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు విజయవాడకు చెందిన లొల్లి పోగు మేరీ జ్యోత్స్న (39), భావన (25), పిడికిటి లక్ష్మీ (31), ఎన్టీఆర్ జిల్లా తెల్లప్రోలుకు చెందిన యాసారపు చిన్ని(31), భీమవరంకు చెందిన షకీనా (24), కృష్ణా జిల్లా పడమట పల్లికి చెందిన చెన్న కేశవుల నాగేంద్రబాబు (31) ఉన్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. ప్రమాదంపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి, కేటీఆర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం
కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి
ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సూచించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రైవేటు బస్సు భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో రాజీ పడకూడదన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు మరింత కఠినంగా పర్యవేక్షించాలన్నారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యతగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని మంత్రి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.








