Mahaa Daily Exclusive

  షావుకారు జానకి మృతి పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సంతాపం.! ఆమె లేని లోటు పూడ్చలేనిది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

Share

• ఏడు దశాబ్దాల సినీ ప్రస్థానంలో చెరగని ముద్ర.
• ఆమె లేని లోటు పూడ్చలేనిది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌, మహా.

ప్రముఖ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాలకు పైగా చలనచిత్ర రంగంలో తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన జానకి ఇక లేరన్న వార్త తనను కలచివేసిందని పేర్కొన్నారు.
చిన్ననాటి నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కళారంగంలోకి అడుగుపెట్టిన షావుకారు జానకి.. అనంతరం వెండితెరపై అడుగుపెట్టి అంచెలంచెలుగా అగ్రస్థానానికి ఎదిగారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ‘షావుకారు’ చిత్రంలో ఆమె కనబరిచిన అసమాన ప్రతిభతో ‘షావుకారు జానకి’గా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాలతో పాటు హిందీ, మలయాళ చిత్రాల్లోనూ నటించి తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. విభిన్న పాత్రలను సహజమైన నటనతో పండిస్తూ పలు తరాల ప్రేక్షకులను అలరించారని పేర్కొన్నారు.
చలనచిత్ర రంగానికి షావుకారు జానకి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆమె పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆమె మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప కళాకారిణిని కోల్పోయిందని, ఆమె లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు.
భగవంతుడు షావుకారు జానకి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Latest