Mahaa Daily Exclusive

  బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌ కేసులో నిధి అగర్వాల్‌కు ఈడీ సమన్లు..! దాదాపు రెండు గంటలపాటు ప్రశ్నలు..

Share

  • దాదాపు రెండు గంటలపాటు ప్రశ్నలు.
  •  కాంట్రాక్టులు, పారితోషికం, బ్యాంకు లావాదేవీలపై ఆరా.

హైదరాబాద్‌, మహా.

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌కు సంబంధించిన కేసులో సినీ నటి నిధి అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బుధవారం సుదీర్ఘంగా విచారించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన విచారణలో ఆమె గతంలో ప్రమోట్‌ చేసినట్లు పేర్కొంటున్న బెట్టింగ్‌ యాప్స్‌, వాటితో చేసుకున్న ఒప్పందాలు, ప్రచార కార్యక్రమాలు, వాటి ద్వారా అందిన పారితోషికానికి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించినట్లు సమాచారం.

విచారణలో భాగంగా బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులతో నిధి అగర్వాల్‌ చేసుకున్న ప్రమోషనల్‌ కాంట్రాక్టుల వివరాలను ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఒప్పందాలు ఎప్పుడు కుదిరాయి, వాటి కాలపరిమితి ఎంత, ప్రచారం కోసం ఎలాంటి కంటెంట్‌ అందించారు, సోషల్‌ మీడియా లేదా ఇతర డిజిటల్‌ వేదికలపై ఎలాంటి ప్రమోషన్స్‌ నిర్వహించారు వంటి అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.

పారితోషికం చెల్లింపులపై ప్రత్యేక దృష్టి

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం కోసం నిధి అగర్వాల్‌కు అందిన రెమ్యునరేషన్‌పై ఈడీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒక్కో ప్రమోషన్‌కు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు, ఆ డబ్బు ఏ మార్గంలో చెల్లించారు, ఎవరి నుంచి చెల్లింపులు వచ్చాయి అనే అంశాలపై వివరాలు నమోదు చేసినట్లు సమాచారం.

ముఖ్యంగా యాప్‌ నిర్వాహకులు లేదా వారికి సంబంధించిన వ్యక్తుల నుంచి నిధి అగర్వాల్‌ బ్యాంకు ఖాతాల్లోకి జరిగినట్లు గుర్తించిన లావాదేవీలపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ మొత్తాలు ప్రమోషనల్‌ ఒప్పందాలకు సంబంధించినవేనా? వాటికి సంబంధించి ఒప్పంద పత్రాలు, ఇన్వాయిస్‌లు లేదా ఇతర ఆధారాలు ఉన్నాయా? అనే కోణంలోనూ విచారణ సాగినట్లు సమాచారం.

లావాదేవీలపై ఈడీ దృష్టి

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న ఈడీ.. ప్రచారం నిర్వహించిన ప్రముఖులు, వారికి జరిగిన చెల్లింపులు, ఆయా సంస్థల ఆర్థిక వ్యవహారాల మధ్య సంబంధాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిధి అగర్వాల్‌ నుంచి సేకరించిన వివరాలు దర్యాప్తులో కీలకంగా మారే అవకాశం ఉంది.

అయితే ఈ విచారణలో నిధి అగర్వాల్‌ను నిందితురాలిగా పేర్కొన్నారా? లేక కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు తెలుసుకునేందుకే ప్రశ్నించారా? అనే అంశంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. విచారణలో ఆమె ఇచ్చిన సమాధానాలు, సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై ఈడీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Latest