Mahaa Daily Exclusive

  విజయవాడలో భారీ బ్యాంకు రుణ మోసం..! రూ.24 కోట్లకు టోకరా..!

Share

  •  రూ.24 కోట్లకు టోకరా!
  • యూనియన్‌ బ్యాంకు నుంచి రుణం.
  •  యూనిట్లు ఏర్పాటు చేయకుండానే షెల్‌ కంపెనీలకు మళ్లింపు.. సీబీఐ దర్యాప్తు.

విజయవాడ, మహా.

విజయవాడలో భారీ కార్పొరేట్‌ రుణ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారంతో యూనియన్‌ బ్యాంకు నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం పొందిన నిందితులు.. ఆ మొత్తంతో అనుమతించిన వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేయకుండా, నిధులను ఇతర సంస్థలకు మళ్లించినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. బ్యాంకు అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నిధుల వ్యత్యాసం బయటపడటంతో వ్యవహారం దర్యాప్తు సంస్థల దృష్టికి వెళ్లింది.

యూనియన్‌ బ్యాంకు నుంచి ‘ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో రుణం తీసుకున్నట్లు బ్యాంకు ఏజీఎం శ్రీకాంత్‌ పాత్రో సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రుణం మంజూరైన అనంతరం ఆరు నెలల్లోనే సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.

రూ.23.85 కోట్లకు బదులు రూ.25 లక్షలే

రుణ మొత్తంతో సంస్థ ఏర్పాటు చేయాల్సిన యూనిట్లు వాస్తవంగా ఉన్నాయా? నిధులు నిర్దేశిత ప్రయోజనానికే వినియోగిస్తున్నారా? అనే అంశాలను పరిశీలించేందుకు బ్యాంకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బ్యాంకు రుణంగా విడుదల చేసిన సుమారు రూ.23.85 కోట్లకు సంబంధించి అక్కడ కేవలం రూ.25 లక్షల విలువైన నిల్వలు మాత్రమే ఉన్నట్లు గుర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో రుణం పొందిన తర్వాత భారీ మొత్తంలో నిధులను ఇతర మార్గాల్లోకి మళ్లించినట్లు బ్యాంకు అధికారులు అనుమానించారు. షెల్‌ కంపెనీల ద్వారా నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో వ్యవహారం మరింత తీవ్రమైంది.

నలుగురు డైరెక్టర్లపై ఆరోపణలు

ఈ వ్యవహారంలో సంస్థ డైరెక్టర్లుగా ఉన్న కోట భానుప్రసాద్‌, కోట శ్రావణి, కోట పృథ్వీ వెంకటతేజ, కోట రాహుల్‌ సాయి బాలాజీలను నిందితులుగా సీబీఐ అధికారులు చేర్చినట్లు సమాచారం. రుణ మంజూరు, నిధుల విడుదల, వాటి వినియోగానికి సంబంధించి బ్యాంకు ఉద్యోగుల పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది.

ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు

రుణం పొందిన సంస్థలో నిధుల వినియోగం, ఆస్తులు, నిల్వలు తదితర అంశాలను పరిశీలించిన సమయంలోనే అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో రుణం మంజూరైనప్పటికీ అందుకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాలు, ఆస్తులు లేకపోవడం బ్యాంకు అధికారులకు అనుమానాలు కలిగించింది.

ఈ వ్యవహారంపై యూనియన్‌ బ్యాంకు ఏజీఎం శ్రీకాంత్‌ పాత్రో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రుణం మంజూరు నుంచి నిధుల బదలాయింపు వరకు జరిగిన లావాదేవీలు, సంబంధిత సంస్థల ఖాతాలు, బ్యాంకు అధికారుల పాత్ర తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Latest