Mahaa Daily Exclusive

  విశాఖ డేటా సెంటర్లపై దుష్ప్రచారం చేయొద్దు..! కొత్త సాంకేతికతతో నీటి వినియోగం మరింత తగ్గుతుంది: మంత్రి నారా లోకేశ్..

Share

• ప్రజల నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి.
• కొత్త సాంకేతికతతో నీటి వినియోగం మరింత తగ్గుతుంది: మంత్రి నారా లోకేశ్

అమరావతి, మహా.

విశాఖపట్నంలో ప్రతిపాదిత డేటా సెంటర్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. డేటా సెంటర్ల నీటి వినియోగంపై దుష్ప్రచారం జరుగుతోందని, విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ డేటా సెంటర్లకు మళ్లించబోమని స్పష్టం చేశారు. కృత్రిమ మేధ ఆధారిత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు డేటా సెంటర్లు అత్యంత కీలకమని పేర్కొన్నారు.

జనసేన ఎమ్మెల్యే నాగమాధవి డేటా సెంటర్లకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఐటీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని తెలిపారు. గూగుల్ పెట్టుబడి కారణంగా విశాఖపట్నంపై ఇతర ప్రముఖ సాంకేతిక సంస్థల్లోనూ ఆసక్తి పెరిగిందని చెప్పారు.

ఏడాదికి మూడు టీఎంసీల నీరు అవసరం

డేటా సెంటర్ల సమగ్ర వ్యవస్థ 6.5 గిగావాట్ల స్థాయికి చేరితే ఏడాదికి సుమారు మూడు టీఎంసీల నీరు అవసరమవుతుందని లోకేశ్ వివరించారు. అయితే ఆధునిక శీతలీకరణ సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కొద్దీ డేటా సెంటర్ల నీటి వినియోగం మరింత తగ్గే అవకాశం ఉందన్నారు.

డేటా సెంటర్లకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్టు నుంచి పారిశ్రామిక అవసరాలకు కేటాయించిన నీటి నుంచే అందిస్తామని స్పష్టం చేశారు. విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలకు కేటాయించిన నీటిని డేటా సెంటర్లకు మళ్లించే ప్రసక్తే లేదన్నారు.

18 నెలల్లో విశాఖకు పోలవరం నీరు

విశాఖపట్నం నగరానికి పోలవరం నుంచి గురుత్వాకర్షణ ఆధారంగా నీటిని సరఫరా చేసే ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. మరో 18 నెలల్లో ఈ నీటి సరఫరా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఒక గిగావాట్‌ సామర్థ్యం కలిగిన ఉష్ణ విద్యుత్‌ కేంద్రంతో పోలిస్తే అదే సామర్థ్యం కలిగిన డేటా సెంటర్‌కు దాదాపు పదో వంతు నీరే అవసరమవుతుందని లోకేశ్ వివరించారు. నీటి వినియోగం విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించకుండా అనవసరమైన భయాందోళనలు సృష్టించడం సరికాదన్నారు.

పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థలకే అవకాశం

డేటా సెంటర్ల అభివృద్ధికి ప్రభుత్వం 6.5 గిగావాట్ల పరిమితిని నిర్ణయించిందని లోకేశ్ తెలిపారు. ఆ లక్ష్యానికి సంబంధించిన కేటాయింపులు ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థలకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.

ఉష్ణ విద్యుత్‌ కేంద్రాలతో పోలిస్తే డేటా సెంటర్ల నీటి వినియోగంపై మాత్రమే ఎందుకు విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయని లోకేశ్ ప్రశ్నించారు. విశాఖ ప్రజల నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ డేటా సెంటర్లను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులతో విశాఖపట్నం దేశంలోని ప్రముఖ సాంకేతిక, కృత్రిమ మేధ కేంద్రాల్లో ఒకటిగా ఎదిగే అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. డేటా సెంటర్లతో పాటు వాటి చుట్టూ ఏర్పడే సాంకేతిక సంస్థలు, ఉపాధి అవకాశాలు, అనుబంధ మౌలిక వసతులతో విశాఖలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని తెలిపారు.

Latest