Mahaa Daily Exclusive

  అసెంబ్లీని బహిష్కరించడం ప్రజాస్వామ్య చరిత్రలోనే లేదు..! వైసీపీ సభ్యుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు..

Share

• వైసీపీ సభ్యుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు.
• ప్రజా సమస్యలపై సభలోనే పోరాడాలని హితవు.

అమరావతి, మహా.

శాసనసభ, శాసన మండలి సమావేశాలను వైసీపీ సభ్యులు బహిష్కరించడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదికగా భావించే శాసనసభను ఒక రాజకీయ పార్టీ మొత్తం బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ అనేది దేవాలయం వంటిదని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అక్కడే ప్రజా సమస్యలను ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. శాసనసభలో ప్రస్తావించే ప్రజా సమస్యలకు విలువ, గుర్తింపు ఉంటుందని, బయట కూర్చొని ఎన్ని విమర్శలు చేసినా వాటికి అదే స్థాయిలో ప్రాధాన్యం ఉండదని అన్నారు. ప్రజలు తమ సమస్యలపై పోరాడేందుకు ప్రతినిధులను అసెంబ్లీకి పంపిస్తారని, అలాంటి అవకాశాన్ని వదులుకోవడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.

నా రాజకీయ జీవితంలో చూడలేదు

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ అత్యున్నత స్థానమని చంద్రబాబు అన్నారు. ఒక పార్టీకి చెందిన సభ్యులంతా సభను బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో ఇదే తొలిసారి చూస్తున్నానని చెప్పారు. గతంలో 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి వంటి నేతలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై తీవ్రంగా పోరాడారని గుర్తుచేశారు.

1989 నుంచి 1994 మధ్య ఎన్టీ రామారావు కొంతకాలం అసెంబ్లీకి హాజరు కాకపోయినా.. తామంతా పార్టీ తరఫున సభకు వెళ్లి ప్రజల తరఫున పోరాటం కొనసాగించామని చంద్రబాబు తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య తాను అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలోనూ తమ పార్టీ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు సభలో ప్రజల తరఫున పోరాడారని చెప్పారు.

ప్రజా సమస్యలపై సభలోనే పోరాడాలి

ప్రజా సమస్యలపై శాసనసభలో సభ్యులు చేసిన పోరాటం ప్రజల్లో చర్చకు దారితీస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు ఓటు వేసి ప్రతినిధులను ఎన్నుకునేది తమ సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారం కోసం పోరాడతారనే నమ్మకంతోనేనని తెలిపారు. శాసనసభను బహిష్కరించి బయట నుంచి విమర్శలు చేయడం వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

గ్రూప్‌-1 వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ సభ్యులు సభకు హాజరుకాకుండా బయట ఉండి డీఎస్సీపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే సభకు వచ్చి చర్చించాలని సూచించారు.

బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించాం

బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను గత వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని ఆరోపించిన చంద్రబాబు.. తమ ప్రభుత్వం వాటిని పునరుద్ధరించిందని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు.

వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు విశ్వసించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించలేరని, ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభను వేదికగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని స్పష్టం చేశారు.

Latest