- దేశానికే ఆదర్శంగా
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్
- నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్
- విలువలతో కూడిన విద్యకు పెద్దపీట
- బాధ్యతాయుత పౌరులగా తీర్చిదిద్దాలి
హైదరాబాద్, మహా : తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనంద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన స్కూల్ సొసైటీ కమిటీ సమావేశంలో ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం అధ్యక్షురాలు లలితా ఆనంద్, కమిటీ సభ్యులతో కలిసి నిర్మాణ పురోగతి, విద్యా ప్రణాళికలు, మౌలిక సదుపాయాలను సమీక్షించారు. పోలీసు పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ పాఠశాల అభివృద్ధికి ఐపీఎస్ అధికారుల సతీమణుల సంఘం కూడా తమ వంతు సహకారం అందించాలని నిర్ణయించింది. సమావేశానికి ముందు డీజీపీ విద్యార్థులతో మమేకమై ఫుట్‌బాల్ ఆడారు. అనంతరం విలువిద్య, ఫెన్సింగ్ తదితర క్రీడల ప్రదర్శనలను వీక్షించి విద్యార్థుల ప్రతిభను అభినందించారు.
పోలీసు సిబ్బంది పిల్లలు, అమర పోలీసుల కుటుంబాల పిల్లలు, సాధారణ ప్రజల పిల్లలకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని డీజీపీ తెలిపారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత వంటి అంశాలను విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
యువతలో మాదకద్రవ్యాల వినియోగం వంటి దుష్ప్రవర్తనలు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలో విలువల ఆధారిత విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమాజం, దేశం పట్ల బాధ్యతతో కూడిన ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే కేంద్రంగా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిలవాలని ఆకాంక్షించారు.
సమీక్షలో పాఠశాల భవనాల నిర్మాణ పురోగతి, విద్యా విధానం, పాఠ్య ప్రణాళిక, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. పెండింగ్ ప్రతిపాదనలు, బిల్లులు, అభివృద్ధి పనులను పరిశీలించి అవసరమైన ఆమోదాలు మంజూరు చేశారు. సీనియర్ పోలీసు అధికారులు తరచూ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, దేశభక్తి, ప్రజాసేవపై మార్గదర్శనం చేయాలని డీజీపీ సూచించారు.
గత ఏడాది 125 మంది విద్యార్థులతో ప్రారంభమైన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రస్తుతం 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతి వరకు మొత్తం 345 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఈ సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, డీజీ (ఆక్టోపస్) డా. అనిల్ కుమార్, ఐజీ (ప్రొవిజనింగ్ అండ్ లాజిస్టిక్స్) గజారావు భూపాల్, సైబరాబాద్ సిపి రమేష్, ఐజీ (వెల్ఫేర్) ఉదయ్ కుమార్ రెడ్డి, శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్, ఫైనాన్స్ అడ్వైజర్ శరత్ కుమార్, ప్రిన్సిపాల్ అనిత, వ్యవస్థాపకుడు విశాల్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.







