Mahaa Daily Exclusive

  ‘కాళేశ్వరం వరం… నిర్లక్ష్యం చేస్తే రైతాంగానికి నష్టం’..! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్..

Share

భూపాలపల్లి, మహా.

రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించిన ఆయన, తన పర్యటన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్ని ఆంక్షలు, ఆటంకాలు సృష్టించినా చివరకు కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్నామని పేర్కొన్నారు.

 

‘ఎల్‌నినోతో రైతులు ఇబ్బందులు’

 

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ అన్నారు. గోదావరిలో వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నప్పటికీ, ఆ నీటిని వినియోగించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల సాధన కోసం తెలంగాణ ఉద్యమం సాగిందని గుర్తు చేశారు. ఆ ఉద్యమ స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామని తెలిపారు.

 

‘రికార్డు సమయంలో నిర్మించిన ప్రాజెక్టు’

 

సముద్ర మట్టానికి 80 నుంచి 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న గోదావరి నీటిని లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసే సాంకేతిక సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని కేటీఆర్ వివరించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసి, మహారాష్ట్రతో చర్చలు జరిపి కేవలం మూడున్నరేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తుమ్మిడిహట్టి వంటి ప్రతిపాదనలపైనా ఆసక్తి చూపలేదని ఆరోపించారు.

 

‘ప్రాజెక్టు నిర్మాణ వైభవం’

 

కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలు, పదిహేను రిజర్వాయర్లు, ఇరవై ఒకటి పంప్‌హౌస్‌లు, పంతొమ్మిది విద్యుత్ ఉపకేంద్రాలు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. రోజుకు లక్ష క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని, వర్షాభావ పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీతో పాటు పలు సాగునీటి వనరులను నింపే అవకాశం ఉందని వివరించారు.

 

‘పునరుద్ధరణలో జాప్యం ఎందుకు?’

 

మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిన తర్వాత వాటి పునర్నిర్మాణానికి సుమారు రూ.400 కోట్లు అవసరమవుతాయని, పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినప్పటికీ గత 31 నెలలుగా ఎలాంటి పురోగతి లేదని కేటీఆర్ ఆరోపించారు. ఇంత పెద్ద ప్రాజెక్టును పక్కన పెట్టి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రూ.94 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు.

 

‘రైతుల ప్రయోజనాలే లక్ష్యం’

 

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానానికి చేరుకుందని, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సైతం పోటీగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి సమయంలో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే హైదరాబాద్ నగరానికి కూడా భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

 

మోటార్లు ఆన్ చేస్తామని హెచ్చరిక

 

రైతుల ప్రయోజనాల కోసం అవసరమైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సంప్రదించి భారీ స్థాయిలో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మోటార్లను ప్రారంభించే ఉద్యమానికి శ్రీకారం చుడతామని కేటీఆర్ హెచ్చరించారు. నీటి ప్రాజెక్టులను రాజకీయాల కోణంలో కాకుండా రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.