- అమరావతి ఓఆర్ఆర్ కు పూర్తి సహకారం అందించండి
- పోలవరం వద్ద ఐకానిక్ వంతెన ప్రాజెక్టు చేపట్టండి
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
న్యూఢిల్లీ, మహా : రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పూర్తి సహకారం అందించాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. 189 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ రాజధాని ప్రాంత అభివృద్దికి అత్యంత కీలకమవుతుందని సీఎం పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయిన ముఖ్యమంత్రి వివిధ అంశాలపై విజ్ఞాపన పత్రాన్ని అందించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రస్తావిస్తూ వాటికి కేంద్రం నుంచి ఆమోదాలు, నిధులు, అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర తీర ప్రాంత అభివృద్ధితో పాటు కనెక్టివిటీ పెంచేందుకు దోహదపడే బీచ్ రోడ్డు ప్రాజెక్టుపైనా దృష్టి సారించాలన్నారు. తీరప్రాంతంలోని నగరాలు, పర్యాటక ప్రాంతాలు, పోర్టులు, పారిశ్రామిక కేంద్రాల మధ్య మెరుగైన అనుసంధానం కల్పించేందుకు బీచ్ రోడ్ ఉపయోగపడుతుందని సిఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఎడమ, కుడి గట్లను కలిపేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి సహకారం అందించాలని సీఎం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ప్రాజెక్టుకు అనుబంధంగా అవసరమైన రహదారి, వంతెనల నిర్మాణానికి సహకరించాలని కోరారు.







