- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా భారీ స్థాయిలో రక్షా ఎక్స్‌పో
- డిసెంబర్ 9న ఎయిర్ షో నిర్వహణ
- రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి ఎక్స్‌పో దోహదం
- సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, మహా : తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ స్థాయిలో రక్షా ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. డిసెంబర్ 9న ఎయిర్ షోను కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రక్షా ఎక్స్‌పో నిర్వహణ ఏర్పాట్లపై సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోకు సంబంధించిన ఏర్పాట్లు, పాల్గొనే సంస్థలు, ప్రచార కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
రక్షణ, వైమానిక రంగాలకు సంబంధించిన సుమారు 30 శాతం పరిశ్రమలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని సీఎస్ తెలిపారు. తెలంగాణలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు రక్షా ఎక్స్‌పో కీలక వేదికగా నిలుస్తుందని అన్నారు.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఆహ్వానం
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ రక్షా ఎక్స్‌పోలో పాల్గొనేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని ప్రముఖ రక్షణ, ఆయుధ తయారీ సంస్థలు, డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు సీఎస్ తెలిపారు.
ఎక్స్‌పోకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అక్టోబర్ 24న హైదరాబాద్‌లో, అక్టోబర్ 29న న్యూఢిల్లీలో రోడ్ షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని సీఎస్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌ఫీల్డ్ స్ట్రిప్ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు ప్రత్యేక వేదిక
ఫిక్కీ, అసోచామ్, ఎస్‌ఐడీఎం, ఎంఎస్‌ఎంఈలతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలను ఎక్స్‌పోలో భాగస్వామ్యం చేయాలని సీఎస్ సూచించారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్ తదితర ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు మార్కెటింగ్, బయ్యర్–సెల్లర్ సమావేశాలు, బిజినెస్ ఇంటరాక్షన్స్, ఎంఓయూలు, స్టార్టప్‌లకు అవకాశాలు, సెమినార్లు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసు, పారామిలటరీ దళాల ఆధునికీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల డీజీపీలను కూడా రక్షా ఎక్స్‌పోకు ఆహ్వానించాలని సీఎస్ సూచించారు.
విస్తృత ప్రచారానికి ఆదేశాలు
రక్షా ఎక్స్‌పోపై హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో స్టాండీలను ఏర్పాటు చేయాలని, షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించాలని సీఎస్ సూచించారు. బ్రోచర్లు, సోషల్ మీడియా తదితర మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, పంచాయతీరాజ్, సెర్ప్ కమిషనర్ దివ్య, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ అజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.







