Mahaa Daily Exclusive

  ప్రజాసేవకు మాజీ మావోయిస్టులు కలిసిరావాలి.

Share

  •  మా పార్టీలో చేరితే సముచిత స్థానం.. మరింత బలోపేతం.
  •  గోశాలలో ఆవుల మరణాలపై ఆవేదన.. కాంగ్రెస్‌ పాలనపై కల్వకుంట్ల కవిత విమర్శలు

వేములవాడ,మహా.

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలని, తమ పార్టీలో చేరి ప్రజల పక్షాన నిలబడాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పర్యటించిన ఆమె, తొలుత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ.. అడవులను విడిచి ప్రజాజీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులకు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు తమ పార్టీ ఒక బలమైన వేదికగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సమాజ మార్పు కోసం తపించే అలాంటి వారి రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను కవిత క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో పెద్దఎత్తున కాంక్రీట్ వినియోగించడాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ప్రాచీన ఆలయాల నిర్మాణానికి ఆగమశాస్త్ర నిబంధనలు ఉంటాయని, ఆగమశాస్త్రం ప్రకారం పవిత్ర కృష్ణశిలలతో పునర్నిర్మిస్తేనే ఈ చారిత్రక క్షేత్రం వందల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా నిలుస్తుందని తేల్చిచెప్పారు. మన పూర్వీకులు అందించిన వారసత్వ సంపదను కాంక్రీట్ కట్టడాలతో నాశనం చేయవద్దని ప్రభుత్వాన్ని, ఆలయ అధికారులను హెచ్చరించారు. మరోవైపు రాజన్న సన్నిధిలో గోవుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆమె కంటతడి పెట్టారు. భక్తులు భక్తిశ్రద్ధలతో కానుకగా సమర్పించిన గోవులకు కనీస మేత, తాగునీరు కూడా అందించకపోవడంతో అవి ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన గోవులకు కనీసం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆలయ యంత్రాంగంపై నిప్పులు చెరిగారు.

సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో వ్యవసాయానికి ఊతమిచ్చేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా సాగునీటి పనులను తక్షణమే పూర్తి చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, పాలనలో పూర్తిగా దిశానిర్దేశం కోల్పోయిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ అసమర్థ పాలనతో విసిగిపోయిన ప్రజలు వితండవాద రాజకీయాల నుంచి విముక్తి కోరుకుంటున్నారని, అందుకే క్షేత్రస్థాయిలో తమలాంటి సరికొత్త ప్రత్యామ్నాయ శక్తుల వైపు ఎంతో ఆశగా చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.