Mahaa Daily Exclusive

  రాష్ట్రంలో ఎల్‌నినో పంజా.

Share

  •  320 మండలాల్లో తీవ్ర కరవు ఛాయలు.
  •  18 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు.. సగానికి పైగా మండలాల్లో వర్షాభావం.
  •  అక్టోబరు నెలాఖరు నాటికి సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌, మహా.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న ఎల్‌నినో ప్రభావం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లోకి నెట్టివేసింది. రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలో గల 320 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నట్లు అధికార యంత్రాంగం ప్రాథమికంగా గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో మొత్తం 621 మండలాలు ఉండగా, అందులో సగానికి పైగా మండలాలు కరవు కోరల్లో చిక్కుకోవడం రైతాంగాన్ని, ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో సుమారు 235 మండలాల్లో కరవు ఛాయలు ఉండవచ్చని అంచనా వేయగా, తాజాగా క్షేత్రస్థాయి నుంచి అందిన వివరాల ప్రకారం ఆ సంఖ్య ఏకంగా 320కి చేరినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

రాష్ట్రంలో నెలకొన్న ఈ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులపై సమగ్ర నివేదికను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జజూ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖపై మంగళవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కరవు మండలాలను శాస్త్రీయంగా గుర్తించాలని సూచించారు. ప్రణాళిక, రెవెన్యూ, భూగర్భ జల, వ్యవసాయం, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించాలని నిర్దేశించారు. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నమోదైన నైరుతి రుతుపవనాల వర్షపాతంతో పాటు, కేంద్ర నిబంధనావళిలో పేర్కొన్న 12 రకాల ప్రామాణికాంశాలను పరిగణనలోకి తీసుకుని అక్టోబరు చివరి నాటికి పూర్తి స్థాయి నివేదికను అందజేయాలని స్పష్టం చేశారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 17 శాతం వర్షపాతం లోటు నమోదు కావడం ఈ దుస్థితికి ప్రధాన కారణమని అధికారులు వివరించారు.

మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ సమావేశం కోసం ప్రత్యేకంగా సమగ్ర అంశాలతో కూడిన మరో నివేదికను రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కరవు పరిస్థితులపై అధ్యయనం చేసి రైతులకు ఊరట కల్పించే చర్యలను సిఫారసు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. క్షేత్రస్థాయి నివేదికలు సిద్ధమైన వెంటనే మంత్రుల బృందం దేశ రాజధాని దిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవనుంది. వర్షాభావంతో తీవ్రంగా దెబ్బతిన్న మండలాలను అధికారికంగా కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని కోరడంతో పాటు, సంక్షోభంలో ఉన్న అన్నదాతలను ఆదుకునేందుకు రాష్ట్రానికి భారీ ఎత్తున కేంద్ర ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేయనుంది.