- విపక్షాల భేటీపై ఈసీ కీలక ప్రకటన.
- ‘ముందుగా సమయం కోరలేదని వెల్లడి.
- పార్లమెంట్ అనెక్స్‌లో భేటీ అసాధారణమని స్పష్టీకరణ.
న్యూఢిల్లీ, మహా.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వైపు చేపట్టిన మార్చ్, తదనంతర పరిణామాలపై ఈసీ అధికారికంగా స్పందించింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీకి సంబంధించి మంగళవారం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు ఏ రాజకీయ పార్టీ కూడా తమతో సమావేశం కోసం అధికారికంగా ఎలాంటి సమయం కోరలేదని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో సుమారు 240 మంది ఎంపీలతో కూడిన భారీ ప్రతినిధి బృందం తమను కలవాలనుకుంటున్నట్లు సాయంత్రం 4 గంటల తర్వాత ఢిల్లీ పోలీసుల ద్వారానే తమకు తొలిసారిగా సమాచారం అందిందని వారు వెల్లడించారు. రాజకీయ పార్టీలతో భేటీల కోసం 2025లోనే ఎన్నికల సంఘం ఒక నిర్దిష్టమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించిందని, ప్రొటోకాల్ ప్రకారమే తాము నడుచుకుంటామని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఎన్నికల సంఘాన్ని కలవాలనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా, ముందుగా తమ అధికారిక ప్రతినిధి ద్వారా విధిగా సమయం కోరాలని ఈసీ అధికారులు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థన అందిన తర్వాత, రెండు పక్షాల పరస్పర అంగీకారంతో భేటీకి అనువైన సమయం, తేదీ ఖరారవుతాయని వివరించారు. ఎంపీల బృందంతో సమావేశం కావాలంటూ ఢిల్లీ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలో, భేటీకి వేదికగా పార్లమెంట్ అనెక్స్‌ను సూచించారని ఈసీ పేర్కొంది. అయితే, రాజ్యాంగబద్ధమైన సంస్థ అధికారులతో పార్లమెంట్ అనెక్స్‌లో ఇలాంటి భేటీ జరగాలన్న ప్రతిపాదన పూర్తి అసాధారణమైనదని స్పష్టం చేసింది. ప్రొటోకాల్ నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం కార్యాలయ ప్రాంగణంలోనే (నిర్వాచన్ సదన్) అధికారిక భేటీలు జరగాల్సి ఉంటుందని కుండబద్దలు కొట్టింది. నిబంధనల మేరకు తాము నడుచుకోవాల్సి ఉన్నందున భేటీ వేదిక మార్పు సాధ్యపడదని పరోక్షంగా తేల్చిచెప్పింది.
అయినప్పటికీ ప్రజాప్రతినిధుల పట్ల గౌరవంతో వారి నుంచి వినతిపత్రం స్వీకరించేందుకు తమ సీనియర్ అధికారి ఒకరిని పంపుతామని ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే, తమ ప్రతిపాదనను ఎంపీల బృందం నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని ఈసీ తన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ పార్లమెంటరీ, ప్రజాస్వామ్య ప్రక్రియలను అత్యున్నత స్థాయిలో గౌరవిస్తుందని అధికారులు ఉద్ఘాటించారు. దేశంలోని ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ అయినా నిబంధనల మేరకు ఎప్పుడైనా ఈసీతో అధికారిక భేటీకి అభ్యర్థించవచ్చని స్పష్టం చేశారు. సరైన పద్ధతిలో అభ్యర్థన అందిన తర్వాత రెండు పక్షాలకు అత్యంత అనుకూలమైన సమయంలో భేటీ తేదీ, సమయాన్ని ఎన్నికల సంఘమే స్వయంగా నిర్ణయిస్తుందని ఆ ప్రకటనలో వెల్లడించారు. పారదర్శకతతో కూడిన ఎన్నికల నిర్వహణలో అన్ని వర్గాల నుంచి సహకారం ఆశిస్తున్నట్లు ఈసీ వర్గాలు తెలిపాయి.







