- పార్టీని వీడిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు.
- ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో ఘోర అవమానం జరిగిందంటూ ఆవేదన.
- ఆత్మగౌరవాన్ని చంపుకుని కొనసాగలేనని స్పష్టీకరణ
భద్రాద్రి కొత్తగూడెం, మహా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత వరుస వలసలతో సతమతమవుతున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో తనకు కనీస గౌరవం దక్కడం లేదని, సొంత పార్టీ నేతలే తనను తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మంగళవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ సన్నద్ధమవుతున్న తరుణంలో, గిరిజన సామాజిక వర్గంలో బలమైన పట్టున్న సీనియర్ నేత పార్టీని వీడటం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాటి వెంకటేశ్వర్లు రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవలే పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో తనకు ఘోర అవమానం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమావేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెల్యేనైన తన పేరును కనీసం ముద్రించకపోవడమే కాకుండా, సమావేశంలో తనను కనీసం వేదిక మీదకు కూడా ఆహ్వానించలేదని ఆయన మండిపడ్డారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావుల పట్ల తనకు అపారమైన గౌరవం ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొందరు స్థానిక నాయకులు ఉద్దేశపూర్వకంగానే కార్యకర్తల ముందే తనను అవమానిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉందని, 1999 నుంచే శాసనసభ్యుడిగా పనిచేశానని గుర్తుచేసిన ఆయన.. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూ ఇలాంటి అవమానకర పరిస్థితులు ఎదుర్కోలేదని వాపోయారు.
నిజానికి గత శాసనసభ ఎన్నికలకు ముందు కూడా తాటి వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తితోనే పార్టీ మారారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధిష్ఠానం తీరుపై కినుక వహించి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే, అక్కడ తనకు ఆశించినట్లుగా అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో తిరిగి పాత గూటికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గెలుపు కోసం ఆయన క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ తిరిగి పార్టీలో తనకు సముచిత స్థానం దక్కకపోగా, అవమానాలు ఎదురవుతుండటంతోనే తాజాగా ఆయన ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, రెండ్రోజుల్లో తన అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు, శ్రేయోభిలాషులతో విస్తృతంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తదుపరి ఏ పార్టీలో చేరాలనే అంశంపై వారితో చర్చించిన అనంతరం అధికారికంగా పూర్తి స్థాయి ప్రకటన విడుదల చేస్తానని వెంకటేశ్వర్లు వెల్లడించారు.








