- ఈసీకి వ్యతిరేకంగా ఢిల్లీ మార్చ్‌లో పాల్గొన్న ఎంపీలు.
- కూటమిలో చేరలేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అన్న సులతా దేవ్ నవీన్ పట్నాయక్‌కు ధన్యవాదాలు తెలిపిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
న్యూఢిల్లీ, మహా .
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని న్యూఢిల్లీలో విపక్ష ‘ఇండియా’ కూటమి చేపట్టిన భారీ నిరసన ప్రదర్శనకు బిజూ జనతాదళ్ (బీజేడీ) మద్దతు పలికింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో అక్రమాలు జరిగాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి ఇండియా కూటమి నేతలు చేపట్టిన మార్చ్‌లో బీజేడీ ఎంపీలు నేరుగా పాల్గొన్నారు. అధికారికంగా ‘ఇండియా’ కూటమిలో భాగస్వామి కానప్పటికీ, జాతీయ స్థాయిలో విపక్షాలు చేపట్టిన ఈ కీలక ఉద్యమానికి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ మద్దతు ప్రకటించడం దేశ రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.
పార్టీ అధినేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకే తాము ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నామని బీజేడీ ఎంపీ మానస్ మంగరాజ్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు మరో ఎంపీ సులతా దేవ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. అయితే, తాము ఈ ఆందోళనలో పాల్గొన్నంత మాత్రాన ‘ఇండియా’ కూటమిలో చేరినట్లు కాదని ఎంపీ సులతా దేవ్ స్పష్టం చేశారు. అధికార ఎన్డీయే కూటమికి, విపక్ష ఇండియా కూటమికి తమ పార్టీ సమాన దూరం పాటిస్తోందన్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆమె తేల్చిచెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకతను కాపాడటం కోసమే తాము ఈ నిరసనలో భాగస్వామ్యమయ్యామని ఆమె వెల్లడించారు.
మరోవైపు విపక్షాల పోరాటానికి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ మద్దతు ప్రకటించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. నవీన్ పట్నాయక్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవడానికి విపక్ష పార్టీల మధ్య పరస్పర సమన్వయం అత్యంత ఆవశ్యకమని మమతా బెనర్జీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.







