Mahaa Daily Exclusive

  సైబర్‌‌ నేరగాళ్ల గుట్టురట్టు.

Share

  •  దక్షిణాదిలో 100 మందికి పైగా ఏజెంట్ల అరెస్టు.
  •  మ్యూల్‌ ఖాతాలు, కేవైసీ పత్రాలు సమకూరుస్తున్న ముఠాలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం.

హైదరాబాద్, మహా:

దక్షిణాది రాష్ట్రాల్లో వేళ్లూనుకున్న సైబర్‌ నేరగాళ్ల నెట్‌వర్క్‌కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ షాక్ ఇచ్చింది. అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిపించి, వాటిని సైబర్‌ ముఠాలకు అప్పగిస్తున్న అక్రమార్కులపై అధికారులు ఉక్కుపాదం మోపారు. సైబర్‌ కేటుగాళ్లకు నిధుల మళ్లింపు కోసం ‘మ్యూల్‌ ఖాతాలు’ (మధ్యవర్తి ఖాతాలు) సమకూరుస్తూ, నకిలీ కేవైసీ పత్రాలను అందజేస్తున్న దళారులపై ఏకకాలంలో విరుచుకుపడి 100 మందికి పైగా కీలక ఏజెంట్లను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలుగుచూసిన ఎన్నో భారీ ఆర్థిక మోసాలతో ఈ నిందితులకు ప్రత్యక్ష సంబంధాలున్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల పరిధిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక బృందాలు దాదాపు రెండు వారాల పాటు నిర్విరామంగా ఈ ఉమ్మడి ఆపరేషన్‌ను కొనసాగించాయి. పక్కా సమాచారంతో ఆయా రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు, ఈ దందాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వంద మందికి పైగా ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి వారి గుర్తింపు కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిపించడం, వాటి ద్వారా వచ్చే డెబిట్ కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర సైబర్ ముఠాలకు విక్రయించడం వీరి ప్రధాన పనిగా తేలింది. నిందితుల స్థావరాల నుంచి వందలాది మ్యూల్ ఖాతాలకు సంబంధించిన డెబిట్‌ కార్డులు, బ్యాంకు పాస్‌బుక్కులు, చెక్‌‌ పుస్తకాలు, పలు మొబైల్ ఫోన్లు, సిమ్‌ కార్డులను అధికారులు భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో పట్టుబడిన ఈ నిందితులను సంబంధిత స్థానిక న్యాయస్థానాల నుంచి ట్రాన్సిట్ వారంట్ పొంది మంగళవారం హైదరాబాద్‌కు తరలించారు. వీరందరినీ నగరంలోని సైబర్ క్రైమ్ విభాగంలో ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, వీరు ఇప్పటివరకు ఎన్ని వందల కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలకు సహకరించారు, వీటిలో విదేశీ హ్యాకర్ల ప్రమేయం ఎంత ఉందనే కోణాల్లో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.