Mahaa Daily Exclusive

  ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.

Share

  •  అధికారులకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశాలు.
  •  45 ఎకరాల అసైన్డ్ భూమి మిస్సింగ్.
  •  ఎక్కడుందో గుర్తించాలన్న ముఖ్యమంత్రి.

హైదరాబాద్, మహా .

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, దాని శివారులోని వెంకటాపురం గ్రామాల పరిధిలో ఉన్న భూముల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ రెండు గ్రామాల పరిధిలో ఇటీవలే రెవెన్యూ అధికారులు చేపట్టిన భూముల సర్వే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్-325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో తాము నిర్వహించిన సర్వేలో కేవలం 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. రికార్డుల్లో ఉన్న మిగతా 45 ఎకరాల భూమి అదృశ్యమైందని, దాని జాడ కనిపించలేదని వారు స్పష్టం చేశారు. అధికారుల నివేదికపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి.. ఆ 45 ఎకరాల అసైన్డ్ భూమి ఎక్కడుందో తక్షణమే తేల్చాలని ఆదేశించారు.

ఆ భూమిని కచ్చితంగా గుర్తించేందుకు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాల్లో అధికారికంగా సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన స్పష్టం చేశారు. సర్వే నంబర్-325 సరిహద్దులోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం (ఫామ్‌హౌస్‌) ఉన్న నేపథ్యంలో, ఈ భూముల వ్యవహారంపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు జారీ చేసి, సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాల్సిందిగా కోరాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక రైతులకు భూమి పంపిణీ.. అమరవీరుల కాలనీ నిర్మాణం

సర్వే నంబర్-325లో ఉన్న ఈ భూమిని, స్థానికంగా ఉన్న అర్హులైన పేద రైతులకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దీనికి తోడు, ఇదే సర్వే నంబర్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా “తెలంగాణ అమరవీరుల కాలనీ”ని నిర్మించాలని ఆయన ఆదేశించారు.

ఈ కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించడమే కాకుండా, సకల సౌకర్యాలతో ఇళ్లను సైతం నిర్మించి ఇవ్వాలని సూచించారు. ఈ కాలనీ నిర్మాణ బాధ్యతలను తెలంగాణ హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి, అంటే వచ్చే ఏడాది జూన్ 2వ తేదీలోగా ఈ అమరవీరుల కాలనీ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన మేరకు అధికారులు గత కొన్ని రోజులుగా ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ పరిసరాల్లోని అసైన్డ్ భూములపై సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే.