Mahaa Daily Exclusive

  ఓటరు జాబితా అవకతవకలపై కాంగ్రెస్ కన్నెర్ర.

Share

  •  ఢిల్లీలో రాహుల్, ప్రియాంక, ఖర్గేల అరెస్టు.
  •  సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఈసీ కార్యాలయం ముట్టడికి యత్నం.
  •  దేశ రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత.. అరెస్టులను తీవ్రంగా ఖండించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి చేపట్టిన ఆందోళన దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంట్ స్ట్రీట్ నుంచి ఎలక్షన్ కమిషన్ కార్యాలయం వరకు చేపట్టిన ఈ మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సహా పలువురు ఎంపీలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న ఈ నిరసనను అణచివేసేందుకు పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేయడం, వాటిని దాటుకుని వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించడంతో రాజధాని వీధుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

ఇండియా కూటమికి చెందిన దాదాపు 300 మందికి పైగా ఎంపీలు, కాంగ్రెస్ అగ్ర నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొనడం ఈ ఆందోళన తీవ్రతకు అద్దం పడుతోంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఓటరు జాబితా రూపకల్పనలో అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈసీ కార్యాలయం వైపు దూసుకెళ్తున్న ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు ఇనుప కంచెలు, భారీ బారికేడ్లు అడ్డుపెట్టారు. అయితే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ, నేరుగా బారికేడ్ల పైకి ఎక్కి నిరసన తెలపడం అక్కడి వేడిని మరింత రాజేసింది. బారికేడ్లను తొలగించుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించిన అగ్రనేతలను, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యతను విస్మరించిందని, సీఈసీ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేశాయి.

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఎన్నికల వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ అహింసాయుతంగా ఉద్యమిస్తున్న నాయకులను బలవంతంగా అరెస్టు చేయడం ముమ్మాటికీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికల వాతావరణాన్ని కాపాడాలని కోరడం నేరమెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరెస్టులు, జైళ్లు, లాఠీ దెబ్బలు గాంధీ కుటుంబానికి గానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకు గానీ ఏమాత్రం కొత్త కాదని ఆయన గుర్తు చేశారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించి జైళ్లలో పెట్టినంత మాత్రాన ఎన్నికల కమిషన్ చేస్తున్న తప్పులపై కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోరాటం ఏమాత్రం ఆగదని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఓటర్ల జాబితా (ఎస్ఎస్ఆర్) తప్పిదాలకు పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి విశ్రమించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.