Mahaa Daily Exclusive

  కేసీఆర్, రేవంత్ కుటుంబాల ఆస్తులపై విచారణ జరపండి హైకోర్టు సీజేకు ఎంపీ రఘునందన్‌రావు లేఖ

Share

  • ఫిర్యాదుగా స్వీకరించినా సరే లేదంటే పిల్ గా స్వీకరించాలని అభ్యర్థన
  • లెక్కించిన ఆస్తులు అక్రమమని తేలితే ప్రజలకు పంచాలని వినతి
  • ఆరోపణలు చేస్తున్న నేతలు విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీత

హైదరాబాద్, మహా : కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న రాజకీయ ఆరోపణల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తుండగా.. వాటికి బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ గులాబీ నేతలు ప్రతివిమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, రేవంత్ రెడ్డి కుటుంబాలకు భారీగా ఆస్తులు ఉన్నాయంటూ బీజేపీ కూడా మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంలోకి బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కూడా ఎంట్రీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై మరొకరు చేస్తున్న ఆస్తుల ఆరోపణల్లో నిజానిజాలను వెలికితీయాలని కోరారు. ఈ ఫిర్యాదును ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)గా లేదా విచారణకు సంబంధించిన ఇతర తగిన రూపంలో స్వీకరించాలని హైకోర్టు జస్టిస్‌ను విజ్ఞప్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

రేవంత్ రెడ్డి, కేటీఆర్‌తో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలపై స్వతంత్రంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని రఘునందన్ రావు పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీన తాను చేసిన ప్రకటనకు అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు అందజేసినట్లు తెలిపారు. పత్రికల్లో ప్రచురితమైన కథనాలు, ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించి, అవసరమైన పత్రాలను ఫిర్యాదుకు జతచేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ.. వాటిపై న్యాయపరమైన విచారణ కోరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని, అందుకే తాను నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించినట్లు వివరించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలు దోచుకుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని పేర్కొన్న రఘునందన్ రావు.. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రూ.50 వేల కోట్లు సంపాదించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ జరపాలని కోరారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తులతో పాటు, వాటికి మించి ఇతర ఆస్తులు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఆరోపణలు నిజమా కాదా అన్నది న్యాయ విచారణ ద్వారానే తేలాలని.. ప్రజలకు వాస్తవాలు తెలియాలని రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి ప్రతిపక్ష నేతలు ప్రస్తావిస్తున్న మెడికవర్ ఆస్పత్రి, స్కూళ్లు, ఇతర వ్యాపారాలకు సంబంధించిన ఆరోపణలపైనా నిజానిజాలు బయటపడాల్సిన అవసరం ఉందని రఘునందన్ రావు పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించినట్లు నిర్ధారణ అయిన సొమ్మును తిరిగి ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా తాను ఫిర్యాదును తపాలా ద్వారా పంపించనున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. ఆస్తుల అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలో రఘునందన్ రావు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.