Mahaa Daily Exclusive

  ఉనికిలో లేని సంస్థల పేర్లతో రూ.32 కోట్ల జీఎస్టీ కుంభకోణం.

Share

  •  నకిలీ ఇన్వాయిస్‌లతో ఐటీసీ స్వాహా.
  •  ప్రధాన నిందితుడికి 14 రోజుల రిమాండ్.
    హైదరాబాద్, మహా:

సికింద్రాబాద్ సీజీఎస్టీ (సెంట్రల్ జీఎస్టీ) కమిషనరేట్ పరిధిలో భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగుచూసింది. క్షేత్రస్థాయిలో ఉనికిలో లేని సంస్థల పేర్లతో నకిలీ ఇన్వాయిస్‌లు సృష్టించి, ఏకంగా రూ.32.28 కోట్ల మేర ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) అక్రమంగా పొందిన వ్యవహారాన్ని కేంద్ర జీఎస్టీ యాంటీ ఎవేజన్ అధికారులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముషీరాబాద్‌కు చెందిన ప్రధాన నిందితుడిని సెప్టెంబర్ 24న అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
టీఎంటీ బార్లు, స్టీల్ పైపులు, ట్యూబుల వ్యాపారం చేస్తున్నట్లు పత్రాల్లో చూపిస్తూ నిందితులు ఈ భారీ మోసానికి తెరతీశారు. వాస్తవానికి ఎలాంటి సరుకు రవాణా జరగకపోయినా, కేవలం కాగితాలపైనే లావాదేవీలు జరిగినట్లు నకిలీ ఈ-వే బిల్లులు, ఇన్వాయిస్‌లు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. అక్రమంగా పొందిన ఈ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జీఎస్టీ బకాయిల చెల్లింపులకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటికే జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దయిన సంస్థలు, వాస్తవంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని బోగస్ సంస్థల పేర్ల మీదే వీరు ఈ బిల్లులు సృష్టించడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించిన అధికారులకు సదరు సంస్థలు చూపించిన చిరునామాల్లో ఎలాంటి వ్యాపారాలు జరగడం లేదని స్పష్టమైంది.
సరుకులు లేదా సేవల కొనుగోలు లేకుండా కేవలం నకిలీ పత్రాలతో ఐటీసీ పొందడం జీఎస్టీ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఈ నేపథ్యంలో నిందితుల వాంగ్మూలాలు, పక్కా ఆధారాలతో జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 69 కింద ప్రధాన సూత్రధారిని అధికారులు అరెస్టు చేశారు. ఈ అక్రమ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరి పాత్ర ఉంది, నకిలీ సంస్థల బ్యాంకు ఖాతాల ద్వారా ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, ఈ బోగస్ ఐటీసీని ఇంకా ఏయే సంస్థలు వినియోగించుకున్నాయి అనే కోణాల్లో సీజీఎస్టీ దర్యాప్తు ముమ్మరం చేసింది. డేటా విశ్లేషణ, రిటర్నుల పరిశీలన ద్వారా ఇలాంటి నకిలీ లావాదేవీలు, పన్ను ఎగవేతదారులపై దేశవ్యాప్తంగా నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు.