• వైద్యం అందించడంలో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం.
• అసలు వాస్తవాలు తేల్చాలని మహిళా కమిషన్ ఆదేశం.
అమరావతి, మహా .
నంద్యాల జిల్లా ఆత్మకూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ) దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ఓ విద్యార్థిని హాస్టల్ పైనుంచి దూకి తీవ్రంగా గాయపడగా, బాధితురాలికి సకాలంలో వైద్యం అందించకుండా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అసలు విద్యార్థిని ఎందుకు గోడ దూకాల్సి వచ్చింది, ఘటనను ఉన్నతాధికారులకు చెప్పకుండా ఎందుకు గోప్యంగా ఉంచారన్న దానిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది.
గురువారం అర్ధరాత్రి ఆత్మకూరు కేజీబీవీలో ఓ విద్యార్థిని బయటకు వెళ్లే క్రమంలో హాస్టల్ పైభాగం నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, రక్తం మడుగులో ఉన్న విద్యార్థినిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన సిబ్బంది.. శుక్రవారం ఉదయం వరకు హాస్టల్‌లోనే ఉంచడం వారి అమానుష తీరుకు అద్దం పడుతోంది. పైగా ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అత్యవసర సమయంలో కనీసం ఉన్నతాధికారులకు, తల్లిదండ్రులకు కూడా సకాలంలో సమాచారం అందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ తీవ్రంగా స్పందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికకు తక్షణమే వైద్యం అందించకపోవడంపై సంబంధిత అధికారులను ఆమె గట్టిగా నిలదీశారు. వైద్యంలో జరిగిన జాప్యం బాధితురాలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విచారణ చేపట్టి పూర్తి నివేదిక అందించాలని ఐసీపీఎస్ డీసీపీఓ మంజునాథ్, సఖి మేనేజర్ శాంతామణిలను ఆదేశించారు. ముందుగా బాధిత బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించి, ఆమె ప్రాణాలకు ముప్పు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
అసలు బాలిక అర్ధరాత్రి ఎందుకు హాస్టల్ నుంచి బయటకు వెళ్లాలనుకుంది, తోటి విద్యార్థినులు లేదా సిబ్బందితో ఏమైనా విభేదాలు తలెత్తాయా, లేక మరేదైనా మానసిక ఒత్తిడికి గురైందా అన్న కోణంలో విచారణాధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేజీబీవీల్లో ఇలాంటి ఘటనలు జరగడం, దానిపై నిర్వాహకులు వ్యవహరించిన తీరు భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. బాలిక వాంగ్మూలంతో పాటు సిబ్బంది, తోటి విద్యార్థులను విచారించి పారదర్శకమైన దర్యాప్తు జరిపితే తప్ప ఈ ఘటన వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన గుర్తుచేస్తోంది.








