• మాఫియా అంతంతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం.
• కేంద్ర హోంమంత్రి అమిత్ షా
గ్రేటర్ నోయిడా: మహా.
ఉత్తరప్రదేశ్‌లో 2017కు ముందు ఉన్న మాఫియా, గుండారాజ్యాన్ని అంతం చేయడం ద్వారానే నేడు పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో శుక్రవారం ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం శాంతిభద్రతలపై ఉక్కుపాదం మోపడం వల్లే రాష్ట్రం నేడు గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందుతోందని ప్రశంసించారు. పరిశ్రమల స్థాపనకు మార్కెట్, మౌలిక వసతుల కంటే మెరుగైన శాంతిభద్రతలు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. 2013లో అప్పటి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించాలనుకున్నా, నాటి క్షీణించిన శాంతిభద్రతల కారణంగా ఆ కార్యక్రమాన్ని ఢిల్లీకి తరలించాల్సి వచ్చిన పరిస్థితిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఉత్తరప్రదేశ్‌ను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న బృహత్తర లక్ష్యంతో మోదీ, యోగి డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు సమన్వయంతో అడుగులు వేస్తున్నాయని అమిత్ షా తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు జరగనున్న ఈ నాలుగో అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఈ దిశగా ఒక కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఆస్ట్రియా, బెలారస్, జపాన్, రష్యా, సింగపూర్, వియత్నాం దేశాల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ భారీ ప్రదర్శనలో 2,400కు పైగా దేశీయ ప్రదర్శనదారులు, 85 దేశాలకు చెందిన 550 మందికి పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని తయారీ, వ్యవసాయ, సాంకేతిక, రక్షణ రంగాలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన నేరుగా అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలవుతున్న ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ (ఓడీఓపీ) కార్యక్రమం స్థానిక యువతకు వారి సొంత ప్రాంతాల్లోనే అపారమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అమిత్ షా కొనియాడారు. ఈ ప్రదర్శన వేదికగా ఓడీఓపీ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. డిజిటల్ వేదికల ద్వారా స్థానిక ఉత్పత్తులకు విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. వ్యవసాయం, వస్త్ర, హస్తకళలు, ఆహార ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలతో పాటు రక్షణ ఉత్పత్తుల తయారీలోనూ యూపీ వేగంగా దూసుకెళ్తోందని చెప్పారు. రాష్ట్ర రక్షణ పారిశ్రామిక కారిడార్, లక్నోలోని బ్రహ్మోస్ పరీక్షా కేంద్రం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర ఉత్పాదక సామర్థ్యానికి నిదర్శనమన్నారు.







