గుంటూరు, మహా : వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా కుంభకోణం కేసులో సెప్టెంబర్ 28వ తేదీన (సోమవారం) తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. వాస్తవానికి శుక్రవారం నాటి విచారణకు వైసీపీ నేత అంబటి రాంబాబు హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాల వల్ల రాలేనని అధికారులకు తెలిపారు. దాంతో విచారణకు వేరే తేదీని కేటాయించాలని ఆయన కోరడంతో స్పందించిన ఈడీ అధికారులు, సోమవారానికి విచారణను వాయిదా వేస్తూ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు.
అంబటి రాంబాబుకు ఇప్పటికే రెండుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. వివిధ కారణాలతో ఆయన విచారణకు హాజరుకాలేదు. మొదట సెప్టెంబర్ 11న రావాలని ఈడీ నోటీసులు పంపగా, అవి తనకు అందలేదని పేర్కొన్నారు. లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేస్తే విచారణకు వస్తానని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఆ తర్వాత శుక్రవారం రావాలని ఆదేశించినా అనారోగ్యం కారణంగా మరోసారి విచారణకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సోమవారం (సెప్టెంబర్ 28న) తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించి తన ముఖ్య అనుచరులైన మర్రి సుబ్బారెడ్డి, రాయపాటి పురుషోత్తంలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టు ఇప్పించారని, దీని ద్వారా భారీగా నిధులు కొల్లగొట్టారని ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో అంబటి రాంబాబును విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని ఈడీ భావిస్తోంది.








