Mahaa Daily Exclusive

  వేలాది మంది జయజయధ్వానాల మధ్య గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణేశుడు లక్షలదిగా తరలివచ్చిన భక్తులు

Share

హైదరాబాద్, మహా : ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌ 4 వద్ద మహాగణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిసింది. ఈ ఏడాది 69 అడుగుల భారీ ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా దర్శనమిచ్చిన స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయానికి ఖైరతాబాద్‌లోని మంటపం నుంచి శోభాయాత్ర అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బాల్‌ మినార్‌, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు ఈ శోభాయాత్ర సాగింది. దారిపొడవునా భక్తులు చల్లిన పూలవర్షం, శివసత్తుల పూనకాలు, దప్పుల వాయిద్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్ర ప్రారంభ సమయంలో మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మహాగణపతి రథం ఎదుట ఉత్సాహంగా డాన్స్ చేసి భక్తుల్లో జోష్ నింపారు.

ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకున్న బడా గణేశుడికి ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల నడుమ చివరి ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో హుస్సేన్‌సాగర్‌లో ఉన్న భారీ క్రేన్ల సాయంతో నిమజ్జన ప్రక్రియను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఖైరతాబాద్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు సాగిన ఈ మహా ఊరేగింపు భక్తుల జయజయధ్వానాలతో కనుల పండువగా సాగింది. “గణపతి బప్పా మోరియా.. అగ్లే బరస్ తూ జల్దీ ఆ” అంటూ వేలాదిమంది భక్తులు తమ ప్రియతమ గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఈ అపూర్వ ఘట్టాన్ని కళ్లారా వీక్షించేందుకు ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్ పరిసర ప్రాంతాలకు భక్తజనం పోటెత్తింది. శోభాయాత్ర సజావుగా సాగేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరం అంతటా పోలీసులు అత్యంత పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.