- ఒక దీపం వెలిగించిన అఖండ జ్యోతి!
సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించే మహనీయులు చరిత్రలో అరుదుగా జన్మిస్తారు. అటువంటి వారిలో అచంచలమైన దేశభక్తి, అకుంఠిత దీక్ష, సమున్నత విద్యాభ్యాసం ఉండి కూడా అత్యంత సామాన్యుడిగా జీవించిన మహర్షి ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) నాల్గవ సర్ సంఘచాలక్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ప్రపంచం ముద్దుగా, ఆప్యాయంగా పిలుచుకునే పేరు ‘రజ్జు భయ్యా’. ఆయన జీవితం ఒక ప్రవహించే నది లాంటిది. ఏ ఆర్భాటాలు లేని, స్వచ్ఛమైన జలధార లాంటి ఆయన జీవన ప్రస్థానం భావితరాలకు ఒక ఉజ్వల మార్గదర్శనం.
ఒక దీపం.. మరొక దీపాన్ని వెలిగిస్తూ..
స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ లాంటి మహనీయులు హిందూ సమాజ ఉద్ధరణ గురించి కలలు కన్నారు. కానీ వారి ఆశయాలను ఆచరణలో పెట్టే కార్యకర్తల సమూహం తయారు కాకపోవడం వారిని బాధించింది. ఎంతో మంది తత్వవేత్తలు, విప్లవకారులు తమ వంతు కృషి చేసినప్పటికీ, సమాజంలో ఒక స్థిరమైన, నిరంతర కార్యకలాపాల గొలుసుకట్టును నిర్మించడంలో శూన్యత ఏర్పడింది. ఆ శూన్యతను పూరించిన దార్శనికుడు డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్. స్వీయ-ఉపేక్షలో, బానిసత్వపు చీకట్లలో మగ్గుతున్న సమాజాన్ని మేల్కొల్పడానికి ఆయన కనుగొన్న అద్భుతమైన విధానమే ‘శాఖ’.
శాఖ అనేది కేవలం ఒక గంట సేపు ఆడుకునే మైదానం కాదు, అదొక వ్యక్తి నిర్మాణ కర్మాగారం. “ఒక వెలుగుతున్న దీపం, మరో దీపాన్ని వెలిగిస్తుంది” అనే ప్రాథమిక సూత్రం ఆధారంగా ఆయన స్వయంసేవకులను తీర్చిదిద్దారు. అలా డాక్టర్ హెడ్గేవార్ వెలిగించిన ఆశయాల దీపశిఖల నుండి ఉద్భవించిన అత్యంత ప్రకాశవంతమైన, నిరాడంబరమైన తేజస్సు రజ్జు భయ్యా.
మేధస్సుకు మారుపేరు.. త్యాగానికి చిరునామా
1922 జనవరి 29న ప్రఖ్యాత ఇంజనీర్ కున్వర్ బల్వీర్ సింగ్, హృదయ వత్సల జ్వాలా దేవి దంపతులకు జన్మించిన రజ్జు భయ్యా బాల్యం నుంచే విపరీతమైన చురుకుదనం ప్రదర్శించారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో (ఫిజిక్స్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, విశ్వవిద్యాలయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఆ రోజుల్లో అంతటి ప్రతిభ ఉన్నవారు సహజంగానే ఐ.సి.ఎస్. (ఇండియన్ సివిల్ సర్వీసెస్) వైపు వెళ్లడమో, లేదా విదేశాలకు వెళ్లి స్థిరపడటమో చేసేవారు. కానీ, దేశభక్తి ఆయన నరనరాన జీర్ణించుకుపోయింది. విదేశీ వ్యామోహాన్ని, ఆకర్షణీయమైన కెరీర్‌ను తృణప్రాయంగా వదిలేసి, తన మాతృసంస్థ అయిన అలహాబాద్ విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకుడిగా చేరారు.
ఆయన మేధస్సు ఎలాంటిదంటే, సాక్షాత్తూ నోబెల్ బహుమతి గ్రహీత, గొప్ప భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ అబ్బురపడేలా చేసింది. రజ్జు భయ్యా ఎం.ఎస్.సి ప్రాక్టికల్ పరీక్షలకు ఎగ్జామినర్‌గా వచ్చిన రామన్, ఆయన ప్రతిభకు ముగ్ధుడై బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు వచ్చి తన పర్యవేక్షణలో పీహెచ్.డి చేయాల్సిందిగా ఆహ్వానించారు. ఒక యువ శాస్త్రవేత్తకు ఇంతకంటే గొప్ప అవకాశం ఉండదు. కానీ, తన హృదయాన్ని అప్పటికే సంఘ కార్యానికి, దేశ సేవకు అంకితం చేసిన రజ్జు భయ్యా, ఎంతో వినయంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించి తన బోధనా వృత్తిని, సామాజిక సేవను కొనసాగించారు.
ఆదర్శ ఉపాధ్యాయుడు.. కఠినమైన క్రమశిక్షణా శీలి
1943 నుండి 1967 వరకు అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో ఒక లెజెండరీ ప్రొఫెసర్‌గా ఆయన చెరగని ముద్ర వేశారు. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త హరీశ్చంద్ర ఆయనకు సహాధ్యాయి కావడం విశేషం. రజ్జు భయ్యా బోధనా శైలి ఎంత అద్భుతంగా ఉండేదంటే, విద్యార్థులు ఆయన క్లాస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసేవారు. ఒకవైపు అధ్యాపకుడిగా ఉంటూనే, మరోవైపు ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనేవారు. చాలాసార్లు సంఘ పని ముగించుకుని, నేరుగా నిక్కరు మీద, లేదా సాధారణ ధోవతి మీద క్లాస్‌కు వచ్చేవారు.
ఆయన నిరాడంబరతకు ఒక సంఘటన ప్రత్యక్ష సాక్ష్యం. ఒకసారి ఆయన కొత్త చొక్కా ధరించి నేరుగా తరగతి గదికి వచ్చి పాఠం చెప్పడం ప్రారంభించారు. ఆయన బోర్డు మీద రాయడానికి తిరిగినప్పుడు, చొక్కా వెనుక భాగంలో కంపెనీకి చెందిన బ్రాండ్ స్టిక్కర్ అలాగే ఉండిపోవడాన్ని విద్యార్థులు గమనించారు. భౌతికమైన ఆకర్షణల పట్ల, తన వేషధారణ పట్ల ఆయన ఎంతటి అనాసక్తతతో ఉండేవారో చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ.
అలాగే, క్రమశిక్షణ విషయంలో ఆయన ఉక్కు మనిషి. ఒకసారి పరీక్షల నియంత్రణాధికారిగా ఉన్నప్పుడు, ఒక విద్యార్థి కాపీ కొడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. రజ్జు భయ్యా వెంటనే డిబార్ ప్రక్రియ ప్రారంభించారు. ఆ విద్యార్థి మొదట బెదిరించాడు, తర్వాత ప్రాధేయపడ్డాడు. అయినా ఆయన వినకపోవడంతో, “నన్ను డిబార్ చేస్తే వెళ్లి యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను” అని బెదిరించాడు. దానికి రజ్జు భయ్యా ఏమాత్రం చలించలేదు. తన జేబులోంచి రెండు రూపాయలు తీసి ఆ విద్యార్థి చేతిలో పెట్టి.. “ఇదిగో రిక్షా ఖర్చులకు రెండు రూపాయలు. త్వరగా వెళ్లి నదిలో దూకెయ్. నీలాంటి మోసకారి విద్యార్థుల వల్లే దేశ భవిష్యత్తు చీకటిమయం అవుతోంది” అని కరాఖండిగా చెప్పారు. ఆయన నిబద్ధత చూసి భయపడిన ఆ విద్యార్థి, కన్నీళ్లతో క్షమాపణలు అడిగి, జీవితంలో మళ్లీ అటువంటి తప్పు చేయనని ప్రమాణం చేశాడు.
అత్యున్నత శిఖరాలపై నిలిచిన సాధారణ స్వయంసేవకుడు
1994లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాల్గవ సర్ సంఘచాలక్‌గా రజ్జు భయ్యా బాధ్యతలు స్వీకరించారు. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) సివిల్ లైన్స్‌లోని ‘8-ఆనంద్’ అనే తన స్వంత బ్రహ్మాండమైన గృహాన్నే ఆయన సంఘ్ కార్యాలయంగా మార్చేశారు. సర్ సంఘచాలక్ అయిన తర్వాత ఒకసారి ఆ కార్యాలయానికి వెళ్లినప్పుడు, ప్రతి గదిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. “ఈ కార్యాలయం అంటే నాకెంతో ఇష్టం” అని ఆయన అన్నప్పుడు.. అందరూ అదొకప్పుడు ఆయన సొంత ఇల్లు కాబట్టి అలా అంటున్నారేమో అనుకున్నారు. కానీ రజ్జు భయ్యా వెంటనే.. “ఇది నా సొంత ఇల్లు అయినందుకు కాదు నాకు ఇష్టం.. ఈ భవనం నిర్మాణం ఎంత నిరాడంబరంగా ఉంటుందంటే, అత్యంత మారుమూల గ్రామం నుంచి వచ్చే ఒక పేద స్వయంసేవకుడు కూడా లోపలికి రావడానికి ఏమాత్రం సంకోచించడు. అందుకే నాకు ఇష్టం” అని చెప్పారు. ఒక అట్టడుగు స్థాయి కార్యకర్త పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమకు ఇది అక్షర సత్యం. రజ్జు భయ్యా ఒక సైద్ధాంతిక మేధావి మాత్రమే కాదు, ఆచరణాత్మక కర్మయోగి. ఆయన జీవితం ఒక సిద్ధాంతానికి, ఒక జాతికి తనను తాను ఎలా అర్పించుకోవాలో నేర్పే ఒక అద్భుతమైన గ్రంథం. పదవులు, హోదాలు ఆయన ముందు చిన్నబోయాయి. తన ఆదర్శాలతో, నిరాడంబరమైన, సహజమైన జీవనశైలితో లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్.. ఆరెస్సెస్ చరిత్రలో, భారతీయ సామాజిక పునర్నిర్మాణ యజ్ఞంలో ఎన్నటికీ ఆరిపోని ఒక అఖండ జ్యోతి. ఆయన అడుగుజాడల్లో నడవడమే, ఆధునిక సమాజం ఆయనకు అర్పించగల నిజమైన నివాళి!
గడల నరసింహారావు.
అసోసియేట్ ఎడిటర్, మహాపత్రిక.








