Mahaa Daily Exclusive

  బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం

Share

•నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

•అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం: ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి మహా,

ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణిని పురుగుల మందు తాగించి దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలోని అమృతరాణి కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కలిసి పరామర్శించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇసాక్, రజితలను ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి సింగరేణిలో ఇంటర్న్‌షిప్ చేస్తోందని తెలిపారు. ఈ నెల 13న ఇద్దరు వ్యక్తులు ఆమెకు పురుగుల మందు తాగించి దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. నిందితులను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారని తెలిపారు.
అమృతరాణి హత్యకు కారణమైన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పటిష్టమైన చార్జిషీట్ దాఖలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో దళితులు, పేదలపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.
రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారని మంత్రి గుర్తు చేశారు.

•రూ.4.12 లక్షల పరిహారం

మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.4.12 లక్షల పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో రూ.4.12 లక్షల పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వ విప్ విజయ రమణారావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం
అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించడంతో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హామీ ఇచ్చారు.
జరిగిన ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

•మహిళలపై దాడులను ఉపేక్షించేది లేదు: మక్కాన్ సింగ్

మహిళలపై వేధింపులకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని రామగుండం ఎమ్మెల్యే ఠాగూర్ మక్కాన్ సింగ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. సింగరేణిలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన సింగరేణి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.