Mahaa Daily Exclusive

  కూతురు పెళ్లి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ పట్టలేదు..

Share

  • కూతురు పెళ్లి అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ పట్టలేదు
  • ఎవరినో కలిశానంటూ, రాజకీయాలు మారిపోతాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు
  • ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల

అమరావతి, మహా : సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారాలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుమార్తె వివాహం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసే ఖర్మ తనకు పట్టలేదంటూ ఘాటుగా స్పందించారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం కట్టుకథలని, అందులో నిజం లేదని కొట్టిపారేశారు. రాజకీయ విశ్లేషణల పేరిట జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా నిరాధారమని, శుద్ధ అబద్ధమని తేల్చిచెప్పారు. గిట్టని వారు చేస్తున్న పస లేని ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వైఎస్సార్ సీపీ అధినేత, తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంపై వస్తున్న వదంతులపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. గతంలో తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనే తాను సోదరుడు జగన్‌ను చివరిసారిగా కలిశానని తెలిపారు. మళ్లీ ఇప్పుడు కలిసినా తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమే వెళ్తానని వివరించారు. తన కుమార్తె పెళ్లికి రావాలని, దంపతులను దీవించాలని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తాను ఆహ్వానిస్తున్నానని, ఇందులో కొత్తేమీ లేదని, వింత అంతకన్నా లేదని తేల్చేశారు. కూతురు వివాహాన్ని సైతం అడ్డుపెట్టుకుని తెర వెనుక రాజకీయాలు చేసే ఖర్మ దివంగత వైఎస్సార్ బిడ్డగా తనకు లేదని ఘాటుగా స్పందించారు.

ఇంటి శుభకార్యానికి, రాజకీయాలకు ముడిపెడుతూ తన విశ్వసనీయతను, రాజకీయ ప్రమాణికతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తూ చూస్తూ ఊరుకునేది లేదని షర్మిల హెచ్చరించారు. త్వరలో తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి వివాహం సందర్భంగా త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ నవదంపతులకు తెలుగు ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు.