Mahaa Daily Exclusive

  కోచింగ్ కేంద్రాలు రాజకీయ కుట్రలకు వేదికలు కాకూడదు..

Share

కోచింగ్ కేంద్రాలు రాజకీయ కుట్రలకు వేదికలు కాకూడదు.
• విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే సహించం.
• సీఎం చంద్రబాబు నాయుడు.

విజయవాడ, మహా:

కోచింగ్ కేంద్రాలు విద్యాబోధనకు వేదికలుగా ఉండాలే తప్ప రాజకీయ కుట్రలకు, విద్యార్థులను రెచ్చగొట్టే కార్యక్రమాలకు అడ్డాగా మారకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయ ప్రయోజనాల కోసం ఆటలాడే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. సచివాలయంలో ఉన్నత విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో కోచింగ్ కేంద్రాల కార్యకలాపాలు, వాటి నియంత్రణ, విద్యార్థుల భద్రత, బోధనా ప్రమాణాలపై ఆయన అధికారులతో చర్చించారు.

కోచింగ్ కేంద్రాలపై నిఘా

విద్య పేరుతో కొన్ని కోచింగ్ సంస్థలు రాజకీయ కుట్రలకు వేదికలుగా మారుతున్నాయన్న సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులను ప్రభావితం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగితే వాటిపై నిఘా పెట్టాలని నిఘా విభాగం, పోలీసు అధికారులను ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

కోచింగ్ వ్యవస్థకు క్రమబద్ధీకరణ

కోచింగ్ కేంద్రాల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. సుప్రీంకోర్టు జూలై 25న ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీఓ 209 ద్వారా పదమూడు మందితో కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఇంటర్మీడియట్, పాఠశాల విద్య, సాంకేతిక విద్య, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు, మానసిక నిపుణులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించినట్లు తెలిపారు.

ప్రతి సంస్థకు తప్పనిసరి నమోదు

రాష్ట్రంలో నిర్వహించే ప్రతి కోచింగ్ కేంద్రం తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేయనుంది. విద్యార్థులకు ర్యాంకు హామీలు ఇవ్వడం, తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను ఆకర్షించడం వంటి చర్యలపై నియంత్రణ విధించనున్నారు. ఫీజుల వివరాలు, తిరిగి చెల్లింపు నిబంధనలు, అర్హత కలిగిన బోధనా సిబ్బంది వివరాలను విద్యార్థులు, తల్లిదండ్రులకు బహిరంగంగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

తప్పుడు ప్రకటనలపై చర్యలు

కోచింగ్ సంస్థలు ర్యాంకులు, ఉద్యోగాలు, ఫలితాలపై అతిశయోక్తి ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమావేశంలో చర్చించారు. కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ ఇప్పటికే పలు కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించిన అంశాన్ని కూడా సమీక్షలో ప్రస్తావించినట్లు తెలిసింది. విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు.

వయసు నిబంధనపై స్పష్టత

కోచింగ్ కేంద్రాల్లో ప్రవేశాలకు వయసు, విద్యార్హతలకు సంబంధించిన నిబంధనలను కూడా క్రమబద్ధీకరించనున్నారు. పదహారేళ్లు దాటిన విద్యార్థులకే నిర్దిష్ట కోచింగ్ కార్యక్రమాల్లో ప్రవేశం కల్పించేలా నిబంధనలు రూపొందించనున్నట్లు సమావేశంలో చర్చ జరిగింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు, కౌన్సెలింగ్ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు.

విజయవాడను కోచింగ్ హబ్‌గా తీర్చిదిద్దాలి

విజయవాడను దేశంలోనే ప్రముఖ విద్యా, కోచింగ్ కేంద్రంగా అభివృద్ధి చేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అయితే ఇందుకు కేవలం పెద్ద సంఖ్యలో కోచింగ్ సంస్థలు ఉండటం సరిపోదని, నాణ్యమైన బోధన, పారదర్శక ఫీజుల విధానం, అర్హత కలిగిన అధ్యాపకులు, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.

కేజీ నుంచి పీజీ వరకు మార్పులు

రాష్ట్ర విద్యావ్యవస్థలో కేజీ నుంచి పీజీ వరకు పాఠ్య ప్రణాళికల్లో అవసరమైన మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని ప్రస్తుత ముప్పై ఆరు శాతం నుంచి 2029 నాటికి అరవై శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సమీక్షలో అధికారులు వివరించారు. విద్యార్థులకు నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు పెంచేలా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించినట్లు సమాచారం.